Mahaa Daily Exclusive

  మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత…

Share

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత.
* గుండెపోటుతో తుదిశ్వాస.
* ఏలూరులో విషాద ఛాయలు.

విశాఖపట్నం, మహా.
ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) కన్నుమూశారు. 57 ఏళ్ల వయసులో గుండెపోటుతో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలో తన నివాసంలో ఉన్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.

ఆళ్ల నాని మృతితో ఏలూరు సహా ఉభయ గోదావరి జిల్లాల్లో విషాదం నెలకొంది. ఆయనకు వివిధ రాజకీయ పార్టీల నేతలు, అభిమానులు, కార్యకర్తలు నివాళులర్పిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి, ఉభయ గోదావరి జిల్లాల రాజకీయాలకు ఆయన మరణం తీరని లోటని పలువురు పేర్కొన్నారు.

ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా

ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ 1969 డిసెంబరు 30న ఏలూరులో జన్మించారు. కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2017లో శాసనమండలి సభ్యుడిగా కూడా పనిచేశారు.

వైఎస్‌ జగన్‌ మంత్రివర్గంలో కీలక బాధ్యతలు

వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆళ్ల నాని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 2019లో ఆయన మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖను ముందుండి నడిపిన నేతల్లో ఆళ్ల నాని ఒకరుగా నిలిచారు.

రాజకీయాలకు దూరం.. టీడీపీలో చేరిక

2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆళ్ల నాని క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. 2024 ఆగస్టు 9న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, క్రియాశీల రాజకీయాలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం 2025 ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

చంద్రబాబు, జగన్‌ దిగ్భ్రాంతి

ఆళ్ల నాని మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆళ్ల నాని చిన్న వయసులోనే గుండెపోటుతో కన్నుమూయడం బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆళ్ల నాని మరణవార్తతో ఏలూరు రాజకీయ వర్గాల్లో విషాదం అలుముకుంది. ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం ఆయనతో ఉన్న రాజకీయ, వ్యక్తిగత అనుబంధాలను గుర్తుచేసుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఆయన అందించిన సేవలను పలువురు స్మరించుకుంటున్నారు.