సీఎం రేవంత్‌రెడ్డి అవినీతి సామ్రాట్.
* బ్లాక్‌మెయిలర్ల సంఘం అధ్యక్షుడు.
* 22ఏ, సాగునీటి ప్రాజెక్టులు, ఇసుకలో కమీషన్లు.
* కొడంగల్ వేదికగా సీఎం అవినీతి పాపాల చిట్టా బయటపెడతాం.
* తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత.
హైదరాబాద్, మహా:
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రేవంత్‌రెడ్డిని అవినీతి సామ్రాట్, బ్లాక్‌మెయిలర్ల సంఘం అధ్యక్షుడు గా అభివర్ణించారు. ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించిన చరిత్ర ఆయనకు ఉందని ఆరోపించారు. శనివారం విడుదల చేసిన వీడియో సందేశంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మిత్రులు, మంత్రులతో కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి తనకు కమీషన్లతో సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలు ప్రజల్లో నవ్వులు పూయిస్తున్నాయని కవిత అన్నారు. “కమల్‌హాసన్ స్థాయిలో ఏకపాత్రాభినయం చేస్తున్నారు” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభను అధికార, ప్రతిపక్షాల మధ్య గొడవలకు వేదికగా మార్చారని ఆమె విమర్శించారు.
గతంలో రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాకముందు ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకుని రియల్టర్లను బెదిరించారని కవిత ఆరోపించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు, మంత్రులు, మిత్రులతో కలిసి అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారని ఆరోపించారు. అవినీతిలో అనుభవం ఉన్న మంత్రులతో కలిసి రాచమార్గంలో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు.
హరీశ్‌రావుతో కుమ్మక్కయ్యారని ఆరోపణ
మాజీ మంత్రి హరీశ్‌రావుతో సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని కవిత ఆరోపించారు. సిద్దిపేటలో నిషేధిత జాబితాలో ఉన్న వంద ఎకరాల భూమిని హరీశ్‌రావు తన తండ్రి, కుటుంబ సభ్యుల పేర్లకు బదలాయించారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకునే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో జరుగుతున్న భూ వ్యవహారాలపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని కవిత డిమాండ్ చేశారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాకుండా.. ప్రజల ముందున్న ఆరోపణలపై విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆమె అన్నారు.
మంత్రుల ద్వారా కమీషన్లు పొందుతున్నారంటూ ఆరోపణలు
22ఏ భూముల వ్యవహారాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, సాగునీటి ప్రాజెక్టులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, ఇసుక వ్యవహారాలను మంత్రి సీతక్కకు అప్పగించి వారి ద్వారా కమీషన్లు పొందుతున్నారని కవిత ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు నుంచి ఇసుక వరకు ప్రతి అంశంలో అవినీతి జరుగుతోందని మండిపడ్డారు.
అయితే ఇవన్నీ కవిత చేసిన రాజకీయ ఆరోపణలే కాగా, వాటికి సంబంధించిన ఆధారాలను ఆమె ఈ వీడియో సందేశంలో వెల్లడించలేదు. సంబంధిత వ్యక్తులు, ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఏ విధంగా స్పందిస్తారన్నది రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదే సమయంలో గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువగా దోచుకున్నారని కవిత విమర్శించారు. ప్రజల కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ.. ఆ పార్టీ నాయకత్వం ఆ దిశగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నేతలను సస్పెండ్ చేసినప్పుడు శాసనమండలిలో ఎందుకు గట్టిగా ప్రశ్నించలేదని ఆమె నిలదీశారు.
కొడంగల్‌లో అవినీతి చిట్టా బయటపెడతాం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవినీతికి సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుంచుతామని కవిత ప్రకటించారు. ఈ నెల 20న కొడంగల్‌లో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహిస్తున్నామని, అదే వేదికగా ముఖ్యమంత్రి అవినీతి పాపాల చిట్టాను ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు.








