విజయ డెయిరీని బలోపేతం చేస్తాం.
• పాల సేకరణలో తాత్కాలిక తగ్గుదల మాత్రమే.
• రైతులకు ఎలాంటి బకాయిలు లేవు.
• నాణ్యమైన పాల ఉత్పత్తులు, మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి.
• డిమాండ్‌కు, సరఫరాకు మధ్య వ్యత్యాసం తగ్గిస్తాం.
• రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి.
హైదరాబాద్, మహా:
విజయ డెయిరీని మరింత బలోపేతం చేసి పాడి రైతులకు అండగా నిలిచేందుకు ప్రజా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శాసనమండలిలో విజయ డెయిరీ పాల సేకరణకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తూ సంస్థ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
విజయ డెయిరీలో పాల సేకరణలో తాత్కాలికంగా స్వల్ప తగ్గుదల నమోదైందని మంత్రి తెలిపారు. దీర్ఘకాలంగా కొనసాగిన లీన్ సీజన్ ప్రభావంతోనే పాల సేకరణలో ఈ తగ్గుదల కనిపించిందని వివరించారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల సగటు రోజువారీ పాల సేకరణను పరిశీలిస్తే 2023–24లో 3.60 లక్షల లీటర్లు, 2024–25లో 4 లక్షల లీటర్లు, 2025–26లో 3.36 లక్షల లీటర్లుగా నమోదైనట్లు వెల్లడించారు.
పాల సేకరణలో తాత్కాలిక ఒడుదొడుకులు ఉన్నప్పటికీ పాడి రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం రాజీపడబోదని వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. పాడి రైతులకు చెల్లించాల్సిన పాల సేకరణ బకాయిలు ఏవీ లేవని తేల్చిచెప్పారు. రైతుల నుంచి సేకరించిన పాలకు సంబంధించి చెల్లింపులు పెండింగ్‌లో లేవని తెలిపారు. తెలంగాణలోని పాడి రైతులకు దేశంలోనే అత్యధిక ధర చెల్లిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
విజయ డెయిరీని ఆధునికీకరించడంతో పాటు పాల ఉత్పత్తుల మార్కెటింగ్‌ను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వినియోగదారులకు నాణ్యమైన పాల ఉత్పత్తులను అందించడం, సంస్థ ఆదాయాన్ని పెంచడం, మార్కెట్లో విజయ డెయిరీ ఉత్పత్తులకు మరింత ఆదరణ కల్పించడం వంటి చర్యలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
కృత్రిమ పన్నీరు తయారీ, విక్రయాలను ప్రభుత్వం నిషేధించిందని మంత్రి తెలిపారు. విజయ డెయిరీ ద్వారా కేవలం పాలతో తయారు చేసిన పన్నీరు మాత్రమే విక్రయిస్తున్నామని స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా వినియోగదారులకు స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.
విజయ డెయిరీకి అదనపు ఆదాయ వనరులను సమకూర్చే దిశగా కూడా చర్యలు చేపడుతున్నామని వాకిటి శ్రీహరి తెలిపారు. సంస్థకు చెందిన అనుకూలమైన స్థలాల్లో పెట్రోలు బంకులు, షాపింగ్ సముదాయాలు ఏర్పాటు చేసి ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. సంస్థ ఆర్థికంగా బలోపేతం కావడానికి ఇటువంటి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు ఉపయోగపడతాయని చెప్పారు.
పశువైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. పశువైద్యశాఖలో 110 మంది వైద్యులు, 304 మంది సహాయక సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులకు సకాలంలో పశువైద్య సేవలు అందేలా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
పాల ఉత్పత్తిని పెంచేందుకు పాడి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించి పాడి గేదెలను పంపిణీ చేసే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. అధిక పాల దిగుబడినిచ్చే పశువుల సంఖ్యను పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు విజయ డెయిరీకి అవసరమైన స్థాయిలో పాల సేకరణను పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న పాల డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన సహకారం అందిస్తూ పాల ఉత్పత్తిని పెంచే చర్యలను ముమ్మరం చేస్తామని తెలిపారు. పాడి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ విజయ డెయిరీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.








