విజయవాడ, మహా : ఇంద్రకీలాద్రిపై విషాదం చోటుచేసుకుంది. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఒక మహిళా భక్తురాలు తీవ్ర అస్వస్థతకు గురై మార్గంమధ్యలో మృతి చెందారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప గ్రామానికి చెందిన కె. పద్మ అనే 61 ఏళ్ల వృద్ధురాలు తన భర్త నాంచారయ్యతో కలిసి దుర్గమ్మ దర్శనం కోసం కొండపైకి వచ్చారు. ఆలయంలో దర్శనం పూర్తయిన అనంతరం, అన్నప్రసాదం స్వీకరించడం కోసం మహామండపం రెండో అంతస్తుకు వెళ్లేందుకు వారు లిఫ్టు వద్దకు చేరుకున్నారు. తమను రెండో అంతస్తులో దింపాలని కోరినప్పటికీ, లిఫ్టు సిబ్బంది వారిని గ్రౌండ్ ఫ్లోర్‌లోనే దింపి.. మెట్ల మార్గంలో పైకి వెళ్లాలని సూచించారు. దీంతో మెట్లు ఎక్కుతున్న క్రమంలో పద్మ తీవ్ర అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన ఆలయ సిబ్బంది వెంటనే ఆమెను గ్రౌండ్ ఫ్లోర్‌కు తీసుకువచ్చి, దేవస్థానం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించే యత్నం చేశారు. అయితే మార్గమధ్యలోనే ఆమె మృతిచెందడంతో దుర్గమ్మ సన్నిధిలో విషాదం నెలకొంది.
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు శుక్రవారం ఉదయం భారీగా తరలివచ్చారు. శ్రావణ మాసంలో చివరి శుక్రవారం కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి క్యూలైన్లలో బారులు తీరారు. ప్రత్యేక పూజలు, దర్శనాల కోసం వచ్చిన భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. దర్శనం కోసం ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల సౌకర్యార్థం నిరంతరాయంగా మంచి నీళ్లు, ఇతర ప్రాథమిక సదుపాయాలను భక్తులకు కల్పించారు.







