- జగన్ మతం మార్చుకోవాలి
- మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు
- తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా వస్తున్నామని ప్రకటన
తిరుపతి, మహా : వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన అనంతరం సరికొత్త రాజకీయ ప్రయాణానికి సిద్ధమవుతున్న రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరుపతి వేదికగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాబోయే కొత్త రాజకీయ పార్టీ మూడో స్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కులాన్ని, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మతాన్ని రాజకీయాల కోసం దారుణంగా వాడుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి సామాజికవర్గం వద్దకు వెళ్లి తాను క్రిస్టియన్‌నని, ముస్లింల వద్దకు వెళ్లి సెక్యులర్‌నని చెబుతూ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా తాము రాబోతున్నామని స్పష్టం చేసిన విజయసాయిరెడ్డి, తమ పార్టీ అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని పూర్తిగా రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇకపై టీటీడీ బోర్డులో రాజకీయ నాయకులకు ఎలాంటి ప్రవేశం ఉండదని, కేవలం పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మిక వేత్తలతోనే ధార్మిక బోర్డును ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా, తిరుపతి క్షేత్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయడంతో పాటు, ప్రపంచస్థాయి హిందూ ధార్మిక సంస్థను తిరుపతిలో నెలకొల్పుతామని భారీ హామీలు ఇచ్చారు.
వైఎస్ జగన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ గారూ.. మీకు రెడ్ల ఓట్లు నిజంగా కావాలనుకుంటే మళ్లీ స్వధర్మానికి, హిందూ మతానికి తిరిగి రండి. అప్పుడే మీ పేరులోని జగన్మోహన్ రెడ్డి అనే పదానికి నికరమైన సార్థకత చేకూరుతుంది అని హితవు పలికారు. ఇదే క్రమంలో విదేశీ అక్రమ వలసలు, రోహింగ్యాల అంశంపై సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, బర్మా నుంచి వచ్చిన అక్రమ రవాణాదారులు ఏపీలోని గ్రామాల్లో నివసిస్తున్నారని, దీనివల్ల పౌరులు మైనారిటీలుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఓటర్ల జాబితా నుంచి నిజమైన పౌరుల పేర్లు తీస్తే తప్పే కానీ, ఇటువంటి డూప్లికేట్ ఎంట్రీలు, అక్రమ సెటిలర్ల పేర్లను తొలగించడంలో ఎలాంటి తప్పులేదని సమర్థించారు.
ఇక తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం, నెయ్యి కొనుగోలు వివాదంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని విజయసాయిరెడ్డి నిలదీశారు. మార్కెట్‌లో కిలో మంచి నెయ్యి ధర రూ. 1000 ఉంటే, ఇందాపూర్ డైరీ పేరుతో కేవలం రూ. 658 లకే తిరుమలకు నెయ్యిని ఎలా సప్లై చేస్తున్నారని ప్రశ్నించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కిలో నెయ్యిని రూ. 320 నుంచి రూ. 411 మధ్య కొనుగోలు చేశారని గుర్తుచేసిన ఆయన, కిలోకు రూ. 250 చొప్పున అన్‌అఫీషియల్ పేమెంట్లు జరిగాయని వస్తున్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం నోరు విప్పాలని, చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తిరుపతి ప్రెస్ మీట్ ద్వారా విజయసాయిరెడ్డి అటు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని, ఇటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఒకేసారి టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో హిందూత్వ కార్డ్, టీటీడీ ప్రక్షాళన అంశాలే ప్రధాన అజెండాగా తమ కొత్త పొలిటికల్ ప్లాట్‌ఫామ్ పనిచేస్తుందనే స్పష్టమైన సంకేతాలను ఆయన ఈ సమావేశం ద్వారా పంపించారు.







