Mahaa Daily Exclusive

  లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్‌కు ఊరట.

Share

• ఉదయ్‌ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు.

హైదరాబాద్‌, మహా.

సహచర మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ఉదయ్‌‌ కృష్ణారెడ్డికి న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయనకు ఉప్పరపల్లి కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టయి గత 67 రోజులుగా చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయన.. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. జాతీయ స్థాయి పోలీసు శిక్షణా సంస్థలో చోటుచేసుకున్న ఈ వ్యవహారంలో సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన తర్వాత ఎట్టకేలకు ఆయనకు బెయిల్ లభించింది.

ఉప్పరపల్లి న్యాయస్థానం పలు కఠిన షరతుల మధ్య ఉదయ్ కృష్ణారెడ్డికి ఈ బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అలాగే, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ప్రతి ఆదివారం విధిగా అత్తాపూర్ పోలీసుల ఎదుట హాజరుకావాలని, దర్యాప్తునకు ఎల్లవేళలా పూర్తిగా సహకరించాలని న్యాయమూర్తి తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం గానీ, బాధితురాలిని బెదిరించే యత్నాలు గానీ చేయకూడదని సూచించారు.

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో (ఎస్‌వీపీ ఎన్‌పీఏ) శిక్షణ పొందుతున్న సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి తనను తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేశారని, అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. బాధితురాలి ఫిర్యాదులోని అంశాల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న అత్తాపూర్ పోలీసులు జులై 18వ తేదీన ఉదయ్ కృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత పలుమార్లు రిమాండ్ పొడిగిస్తూ రావడంతో అప్పటి నుంచి చర్లపల్లి జైలుకే పరిమితమైన ఆయన 67 రోజుల పాటు న్యాయపోరాటం చేసి ఎట్టకేలకు బెయిల్‌పై బయటకు వచ్చారు.