Mahaa Daily Exclusive

  ‘క్యూర్’ పరిధిలో ప్రకటనలపై కొరడా.

Share

  •  కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం.
  •  ప్రతి వార్డుకూ ప్రత్యేకంగా అడ్వర్టైజ్‌మెంట్‌ నోడల్ ఆఫీసర్‌ నియామకం.
  •  అమలు బాధ్యతలను కమిషనర్లకు అప్పగిస్తూ పురపాలక శాఖ ఆదేశాలు

హైదరాబాద్‌, మహా.

రాష్ట్ర రాజధాని పరిసరాల్లోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్ – CURE) పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర సుందరీకరణను దెబ్బతీయకుండా, వాహనదారులు, పాదచారుల భద్రతకు విఘాతం కలగకుండా తాత్కాలిక, హైపర్‌ లోకల్ ప్రకటనల నిర్వహణపై సమగ్ర విధివిధానాలతో కూడిన సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. నగర పరిధిలో ప్రకటనల పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేందుకు ప్రతి వార్డుకు ప్రత్యేకంగా ఒక ‘అడ్వర్టైజ్‌మెంట్ నోడల్ ఆఫీసర్’ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నూతన నిబంధనల ప్రకారం ప్రచార బోర్డుల ప్రదర్శన కాలపరిమితిపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ప్రత్యేక కార్యక్రమాలు, ప్రచారాల కోసం ఇచ్చే తాత్కాలిక ప్రకటనలకు గరిష్ఠంగా కేవలం 3 రోజుల పాటు మాత్రమే అనుమతిస్తారు. అలాగే స్థానిక స్థాయి ప్రచార అవసరాల కోసం ఏర్పాటు చేసుకునే హైపర్‌ లోకల్ ప్రకటనలకు గరిష్ఠంగా 7 రోజుల వరకు మాత్రమే అనుమతి మంజూరు చేస్తారు. నిర్దేశిత గడువు ముగిసిన వెంటనే సంబంధిత ప్రచార బోర్డులను నిర్వాహకులే తొలగించాల్సి ఉంటుంది. అధికారిక అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా ప్రకటనలు ఏర్పాటు చేస్తే వాటిని అధికారులు తక్షణమే తొలగించడమే కాకుండా, బాధ్యులపై భారీగా జరిమానాలు విధించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రజా ఆస్తులు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లపై ఎలాంటి బ్యానర్లు, హోర్డింగులు, పోస్టర్లు ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. రహదారులపై ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం కలిగించేలా, పాదచారుల నడక మార్గాలను (ఫుట్‌పాత్‌లను) ఆక్రమించేలా ఎక్కడా ప్రకటనలు పెట్టకూడదని ఆదేశించింది. ట్రాఫిక్ సిగ్నల్స్, భద్రతా నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల దృశ్యాలకు అడ్డుతగిలేలా ప్రచార బోర్డులు ఉంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. ఈ సరికొత్త మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసే పూర్తి బాధ్యతలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌‌ఎంసీ)తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి పరిధిలోని కార్పొరేషన్ల కమిషనర్లకు ప్రభుత్వం అప్పగించింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఏమాత్రం ఉపేక్ష లేకుండా కొరడా ఝళిపించాలని ఆదేశాలు జారీ చేసింది.