Mahaa Daily Exclusive

  విజయవాడ దసరా ఉత్సవాలకు తమిళనాడు సీఎం విజయ్‌కు ఆహ్వానం.

Share

  •  విజయవాడ ఉత్సవ్‌-2.0కు రావాలని కోరిన ఏపీ ఎంపీల బృందం.

అమరావతి, మహా .

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా నిర్వహించనున్న శరన్నవరాత్రి దసరా మహోత్సవాలతో పాటు ప్రతిష్ఠాత్మక ‘విజయవాడ ఉత్సవ్‌-2.0’కు ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌కు సాదర ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంట్‌ సభ్యుల బృందం మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేసింది. బెజవాడ నగర విశిష్టత, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా నిర్వహించతలపెట్టిన విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొని కార్యక్రమాలకు మరింత శోభ తీసుకురావాలని ఈ సందర్భంగా నేతలు ఆయనను కోరారు.

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌‌ను కలిసిన ప్రతినిధి బృందంలో పార్లమెంట్‌ సభ్యులు కేశినేని శివనాథ్‌‌ (చిన్ని), లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జి.ఎం. హరీశ్‌ బాలయోగి తదితరులు ఉన్నారు. దసరా పర్వదినాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత కనకదుర్గమ్మను దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షాలు అందుకోవాలని, అలాగే విజయవాడ నగర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని ఆస్వాదించేందుకు విచ్చేయాలని ఎంపీలు ఆయనను ప్రత్యేకంగా అభ్యర్థించారు. విజయవాడ ఉత్సవ్‌-2.0లో భాగంగా ఏర్పాటు చేయనున్న విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవ విశేషాలను ముఖ్యమంత్రికి వివరించినట్లు ఎంపీల బృందం తెలిపింది. ఈ ప్రతిష్ఠాత్మక వేడుకలకు తమిళనాడు సీఎం విజయ్ రాక కోసం యావత్ విజయవాడ ప్రజానీకం, ఉత్సవ కమిటీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వారు పేర్కొన్నారు.