Mahaa Daily Exclusive

  14న దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

Share

  • 16న మూల నక్షత్రం వేళ కుటుంబసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు.

విజయవాడ, మహా.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత కనకదుర్గమ్మను ఈ నెల 14వ తేదీ సాయంత్రం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆమె 14, 15 తేదీల్లో విజయవాడలోనే బస చేస్తారని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరగనున్న దసరా శరన్నవరాత్రుల ఏర్పాట్లను మంగళవారం మంత్రుల బృందంతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతిష్ఠాత్మక సరస్ ఉత్సవాల నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నగరానికి విచ్చేయనున్నారని, వారికి కూడా అమ్మవారి దర్శన ఏర్పాట్లు పకడ్బందీగా కల్పిస్తామని చెప్పారు. దసరా మహోత్సవాల్లో అత్యంత పవిత్రమైన మూల నక్షత్రం రోజైన ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసమేతంగా విచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని మంత్రి వివరించారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దసరా నవరాత్రి ఉత్సవాలను మునుపెన్నడూ లేని రీతిలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఉత్సవాల వేళ ఇంద్రకీలాద్రికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనాలను అత్యంత సులభతరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఈ తొమ్మిది రోజుల పాటు దాదాపు 25 లక్షల మంది భక్తులు దుర్గమ్మ దర్శనార్థం తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారని, అందుకు అనుగుణంగా ప్రతిరోజూ సుమారు 2.5 లక్షల మంది భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నామని వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొండచరియలను సురక్షితంగా తొలగించి ఆ ప్రాంతాన్ని తాత్కాలికంగా భక్తుల రాకపోకలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, రైల్వే శాఖకు చెందిన స్థలాన్ని ప్రత్యేకంగా హోల్డింగ్ ఏరియాగా వినియోగిస్తున్నామని చెప్పారు.

భక్తుల రద్దీ నియంత్రణకు హోల్డింగ్ ఏరియా నుంచి ఆలయం వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల మేర బారికేడ్లతో పటిష్టమైన క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉండే వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఎండ, అలసట బారిన పడకుండా స్వచ్ఛమైన తాగునీరు, పాలు, బిస్కెట్లు నిరంతరం అందజేసేలా స్వచ్ఛంద సంస్థలు, సిబ్బందిని నియమిస్తున్నామని చెప్పారు. హోల్డింగ్ ఏరియాలోనే భక్తులకు నిరంతరాయంగా ప్రసాద వితరణ ఉంటుందని పేర్కొన్నారు. నగరంలోకి వచ్చే అన్ని ప్రధాన రహదారులను అనుసంధానిస్తూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ నెల 23వ తేదీ తర్వాత రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భవానీ దీక్షాపరులు ఇంద్రకీలాద్రికి తరలివస్తారని, వారి కోసం ప్రత్యేక మార్గాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూనే ప్రముఖులకు ప్రొటోకాల్ ప్రకారం దర్శనాలు కల్పిస్తామని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు వచ్చే సమయంలో మాత్రమే భద్రతా కారణాల దృష్ట్యా కొద్దిసేపు సామాన్యుల దర్శనాలను నిలిపివేస్తామని చెప్పారు. అంతరాలయ దర్శనంలో ఎక్కడా తొక్కిసలాట, ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, నిబంధనల ప్రకారం ఉదయం, సాయంత్రం వేళల్లో 2 గంటల 45 నిమిషాల చొప్పున మాత్రమే వీఐపీ దర్శనాలకు సమయం కేటాయించినట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.