- మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం యువత నడుం బిగించాలి.
- గవర్నర్ శివప్రతాప్ శుక్లా.
హైదరాబాద్, మహా.
మత్తు పదార్థాలు లేని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి నేటి యువతరం ముందు వరుసలో నిలవాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ దేశ పునర్నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం పర్యటించిన గవర్నర్, మెదక్ – సిద్దిపేట జాతీయ రహదారి (ఎన్‌హెచ్-765 డీజీ) వెంట నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో తలపెట్టిన భారీ జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు, జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
రామాయంపేట నుంచి సిద్దిపేట వరకు విస్తరించి ఉన్న ఎన్‌హెచ్-765 డీజీ రహదారికి ఇరువైపులా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మొత్తం 45 కిలోమీటర్ల మేర జీడిమామిడి మొక్కలను నాటాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు నిర్ణయించారు. ఈ బృహత్తర మొక్కల పెంపకం యజ్ఞాన్ని స్వయంగా మొక్క నాటి ప్రారంభించిన అనంతరం గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక సంకల్పం తీసుకుంటే దానిని విజయవంతంగా సాధించి తీరుతుందని ఆయన కొనియాడారు. గతంలో గ్రామాల్లో మావోయిస్టుల ప్రాబల్యం తీవ్రంగా ఉండేదని, నిత్యం తుపాకుల గర్జనలతో పల్లెలు భయానక వాతావరణంలో బతికేవని గుర్తుచేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ పటిష్టమైన చర్యల వల్ల అలాంటి హింసాత్మక, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలకు పూర్తి విముక్తి లభించిందని, ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో పల్లెలు అభివృద్ధి బాట పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే మహత్తర బాధ్యత యువత భుజస్కంధాలపైనే ఉందని, సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, గంజాయి వంటి మహమ్మారులను పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని గవర్నర్ దిశానిర్దేశం చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, జాతీయ రహదారుల వెంట నాటే మొక్కలను సంరక్షించి భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని కోరారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ముందడుగు వేసినప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు సఫలీకృతమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రహదారి సుందరీకరణ, హరితహారం తరహా కార్యక్రమాల విస్తరణపై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో పాటు స్థానిక నాయకులను గవర్నర్ అభినందించారు.








