- ఆసుపత్రి పరిపాలనా వ్యవస్థ పై పర్యవేక్షణ ఉండాలి
- వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
- అనుమతి లేకుండా గైర్హాజరైన వారికి షోకాజ్ నోటీసులు
వరంగల్,ఎంజీఎం మహా ;
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అడ్మినిస్ట్రేషన్ విభాగాలతో పాటు రికార్డు రూమ్, ల్యాబ్, వివిధ విభాగాలను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లోని అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్, ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన అధికారులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంజీఎం అడ్మినిస్ట్రేషన్ అధికారిని స్పష్టంగా ఆదేశించారు. అధికారులు, సిబ్బంది విధులకు క్రమం తప్పకుండా హాజరై తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
రికార్డు రూమ్ ను పరిశీలించిన కలెక్టర్, రికార్డులను క్రమబద్ధంగా భద్రపరచడంతో పాటు రికార్డు రూమ్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ల్యాబ్ లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి
ల్యాబ్‌ను తనిఖీ చేసిన ఆమె, అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఐడి కార్డులు, మాస్కులు, చేతి గ్లౌజులు ధరించి జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ల్యాబ్ మ్యానువాల్ స్లిప్స్ కాకుండా ఆన్లైన్ లో ప్రోగ్రామ్ రూపొందించి టెక్నాలజీ ఉపయోగించి పీషెట్స్ కి త్వరితగతిన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఎంజీఎం ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రి పరిపాలనా వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా పర్యవేక్షణను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు.
ఎంజీఎం కి కుక్కలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. సెక్యూరిటీ గార్డ్స్ జాగ్రత్తగా నిబద్ధతతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ ఆకస్మిక తనిఖీలో ఎంజీఎం సూపరింటెండెంట్ హరిచంద్ర రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజారెడ్డి, డీబీసీడీవో పుష్పలత తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.








