Mahaa Daily Exclusive

  పల్లె ప్రగతికి శాశ్వత బాటలు.

Share

  •  దసరాకు 7,448 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం.
  •  నీటి భద్రత, ఆస్తుల కల్పనపై సర్కారు ప్రత్యేక దృష్టి.
  •  అధికారులకు మంత్రి సీతక్క దిశానిర్దేశం.
    వరంగల్,మహా.

గ్రామీణ తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. పల్లెల్లో తాత్కాలిక పనులకు స్వస్తి పలికి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రహదారుల అనుసంధానం, తాగునీటి భద్రత, జల సంరక్షణ తదితర అంశాలను సమగ్రంగా అమలు చేయాలని నిర్ణయించింది. హైబ్రిడ్ యాన్యుటీ విధానం (హ్యామ్‌) కింద తొలిదశలో సుమారు 7,448 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ఈ పనులన్నింటికీ సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చేసి, దసరా నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.
గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర రాజధాని వరకు మెరుగైన రవాణా వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టింది. హ్యామ్‌ విధానం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. రహదారుల నిర్మాణ వ్యయంలో 40 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుండగా, మిగిలిన 60 శాతాన్ని రాయితీదారులు బ్యాంకు రుణాల ద్వారా సమీకరిస్తారు. ఈ మొత్తాన్ని 15 ఏళ్ల వ్యవధిలో 30 వాయిదాల్లో ప్రభుత్వం వారికి తిరిగి చెల్లిస్తుంది. నిర్మాణంతో పాటే రోడ్ల నిర్వహణ బాధ్యత కూడా గుత్తేదారులదే కావడంతో నాణ్యమైన రహదారులు అందుబాటులోకి రానున్నాయి. ఈ రవాణా సౌకర్యాల మెరుగుదలతో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సకాలంలో, తక్కువ ఖర్చుతో తరలించే అవకాశం కలుగుతుంది. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకోనుంది.
రహదారులతో పాటే గ్రామీణ నీటి భద్రత, వనరుల సంరక్షణపైనా మంత్రి సీతక్క స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌నినో ప్రభావం పొంచి ఉన్న నేపథ్యంలో ముందస్తుగా జలాశయాల్లో నీటిమట్టాలను నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. మిషన్ భగీరథ కింద నీటి సరఫరాలో అంతరాయం ఎదుర్కొంటున్న 86 ఆవాసాలను గుర్తించి, సాంకేతిక లోపాలను సరిచేసి యుద్ధప్రాతిపదికన ఆ సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. మరోవైపు వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేందుకు జల సంరక్షణ ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ‘ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి గ్రామానికి ఊటకుంట’ కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఉపాధి హామీ పథకాన్ని కేవలం కూలీలకు రోజువారీ పని కల్పించడానికే పరిమితం చేయకుండా, గ్రామానికి శాశ్వత ఆస్తులు సమకూర్చేలా పనుల ఎంపిక జరగాలని ప్రభుత్వం యోచిస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న నిర్వహించనున్న గ్రామసభల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా వచ్చే ఏడాది చేయాల్సిన పనులను గుర్తించి ఆమోదించనున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 9,745 గ్రామ సమాఖ్య భవనాలతో పాటు పంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.