• 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతికి ఘన వీడ్కోలు.
హైదరాబాద్, మహా:
హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన వేడుకలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన విగ్రహాన్ని వేలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు.
ఉదయం ప్రారంభమైన శోభాయాత్ర
ఖైరతాబాద్‌లో ఉదయం 9.30 గంటలకు మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. గణనాథుడి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులతో పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి. గణపతి బప్పా మోరియా నినాదాలతో శోభాయాత్ర మార్గం మార్మోగింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ శోభాయాత్రలో పాల్గొని ఉత్సాహంగా సందడి చేశారు.
ఎన్టీఆర్ మార్గ్ వైపు పయనం
ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన క్రేన్ నంబర్ 4 వద్ద మహాగణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి సిద్ధం చేశారు.
మధ్యాహ్నం 2.15 గంటలకు నిమజ్జనం
ఎన్టీఆర్ మార్గ్‌లో ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ క్రేన్లను ఉపయోగించి విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌లోకి తరలించారు. మధ్యాహ్నం 2.15 గంటలకు పంచముఖ సంకటహర మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. తమ ఆరాధ్య దైవానికి భక్తులు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు.
పటిష్ఠ బందోబస్తు
మహాగణపతి నిమజ్జనాన్ని పురస్కరించుకుని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర మార్గంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలీసుల పర్యవేక్షణలో నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పూర్తయింది.








