Mahaa Daily Exclusive

  2027 నాటికి హంద్రీనీవా పూర్తి కావాలి.

Share

  •  అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం.
  •  శ్రీనివాసపురం రిజర్వాయర్ పనుల పురోగతిపై సమీక్ష
    స్థానిక సమరానికి సిద్ధం కావాలని మంత్రులకు దిశానిర్దేశం.

అమరావతి, మహా.

రాయలసీమ ప్రాంత వరప్రదాయిని అయిన హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టు పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ 2027 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, శాంతిభద్రతలు సహా స్థానిక సంస్థల ఎన్నికలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్-2 పనుల పురోగతి, శ్రీనివాసపురం రిజర్వాయర్ టెండర్ ప్రక్రియపై రవాణా, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫేజ్-2లోని మిగిలిన పనులకు రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరైనందున పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు.
రాయచోటి నియోజకవర్గ పరిధిలోని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రధాన కాలువ 490 నుంచి 535 కిలోమీటర్ల వరకు సుమారు రూ.350 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే పనులను అత్యంత సమగ్రంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రాజెక్టు పరిధిలోని శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లను కాలువతో అనుసంధానించాలని మంత్రి మండిపల్లి ప్రస్తావించగా.. ఈ పనుల ద్వారా రాయలసీమలోని సుమారు 25 వేల ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూరడంతో పాటు, మార్గమధ్యంలోని ఖాళీ చెరువులను నీటితో నింపేలా పక్కా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి నిధులు మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబుతో పాటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు మంత్రి మండిపల్లి ధన్యవాదాలు తెలిపారు. అక్టోబర్ 2న మదనపల్లెలో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’కు శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నందున రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించి సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు.
మరోవైపు రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. తొలిదశలో మున్సిపాలిటీలు, రెండో దశలో జెడ్పీటీసీ, మూడో దశలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. కూటమిలోని మూడు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో పూర్తి సమన్వయం, ఐక్యత ఉండాలని.. ఇన్‌ఛార్జ్ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకుని కూటమి అభ్యర్థుల విజయానికి గట్టిగా కృషి చేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం తేల్చిచెప్పారు. టీడీపీ కేంద్ర కార్యాలయం, శాప్ కార్యాలయంపై గతంలో దాడికి పాల్పడింది ఒకే ముఠా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చొని క్రిమినల్స్, రౌడీషీటర్లను పురమాయించి రాష్ట్రంలో నేరాలు చేయిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. రాజకీయ ముసుగులో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసాలు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ లేదా ప్రజా ఆస్తులకు నష్టం కలిగిస్తే సదరు నష్టాన్ని నిందితుల నుంచే పూర్తిస్థాయిలో రికవరీ చేసేలా నూతన కఠిన చట్టాన్ని తీసుకురావాలని డీజీపీని సీఎం చంద్రబాబు ఆదేశించారు.