Mahaa Daily Exclusive

  డీఎస్సీపై చర్చిద్దాం…

Share

  • డీఎస్సీపై చర్చిద్దాం
  • దమ్ముంటే అసెంబ్లీకి రండి
  • వైసీపీకి సీఎం చంద్రబాబు ఛాలెంజ్
  • కుప్పం సభలోవైసీపీపై విరుచుకుపడ్డ సీఎం
  • స్పోర్ట్స్ కోటా టీచర్లపై దాడులపై ఆగ్రహం

కుప్పం, మహా : డీఎస్సీపై వైసీపీ చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలేనని, నిజంగా చర్చించాలన్న చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సీఎం చంద్రబాబునాయుడు జగన్ కు సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లా కుప్పం బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు వైఎస్సార్‌సీపీ వైఖరిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తన హయాంలో 14 డీఎస్సీలు నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు. మెగా డీఎస్సీపై ఆరోపణలకు బదులుగా, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఛాలెంజ్ చేశారు. విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద స్వశక్తితో, ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ శ్రేణులు, గొడ్డలి పార్టీ రౌడీలు దాడులకు తెగబడటాన్ని తీవ్రంగా ఖండించారు. గురువులపై దాడులు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. టీచర్ల జోలికొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి, రౌడీయిజం చేసేవారి తోక కత్తిరిస్తామని సీఎం గట్టిగా హెచ్చరించారు. నాటి పాలనలో పాలకులే రౌడీయిజం చేశారని, చంపడానికి, చావడానికి సిద్ధమని వైసిపి ఎమ్మెల్సీ మాట్లాడటంపై మండిపడ్డారు. మిమ్మల్ని చంపడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు, మీరు కూడా చావొద్దు. నేరస్థులకు ఇది ప్లేస్ కాదు, మంచివాళ్లు ఉండే అడ్డా అని.. హద్దుమీరితే ప్రజలే తరిమికొడతారని స్పష్టం చేశారు.

చంద్రబాబు అంటే లీకేజీలు ఉండవు..

మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ నేతలు కావాలనే పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, సీబీఎన్ హయాంలో నిర్వహించే ఏ పరీక్షలోనూ అవినీతికి గానీ, పేపర్ లీకేజీలకు గానీ తావుండదని చంద్రబాబు తేల్చిచెప్పారు. తన 17 ఏళ్ల పాలనలో 14 సార్లు పారదర్శకంగా డీఎస్సీలు నిర్వహించి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చానని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం రాగానే తొలి సంతకంతో మెగా డీఎస్సీ తెచ్చి 16,000 పైగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తే, కోర్టుల్లో 350కి పైగా పిటిషన్లు వేసి అడ్డుకోవాలని చూశారని విమర్శించారు. చట్టబద్ధమైన నియామక ప్రక్రియ ముగిసిన ఏడాది తర్వాత బురద చల్లడం దారుణమన్నారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని, సాక్ష్యాధారాలతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో క్రీడలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇచ్చి, ఇప్పుడు తమ ప్రభుత్వంలో అవే సర్టిఫికెట్లతో ఉద్యోగాలు వస్తే ఫేక్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. చివరకు ఆర్మీలో పనిచేసి కుప్పంలో టీచర్‌గా ఎంపికైన ఒక మాజీ సైనికుడిని స్కూలు నుంచి బయటకు పిలిచి ఓ ఛానల్ రిపోర్టర్ అవమానించడాన్ని ఎండగట్టారు. టీచర్లను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, రౌడీయిజం, సైకో సంస్కృతికి కుప్పం గడ్డపై స్థానం లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు.

గొడ్డలి పార్టీ నాయకులకు క్రమంగా మైకం, పూనకాలు వస్తున్నాయని.. అయితే వారి బెదిరింపులు లేదా అవాకులు చవాకులు తమ వద్ద సాగవని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ హయాంలో చేపడుతున్న పారదర్శక నియామకాలపై అబద్ధాలు ప్రచారం చేయడం మాని, ధైర్యముంటే గత వైసీపీ ప్రభుత్వంలో సాగిన ‘జే-బ్రాండ్ల’ మద్యం దందాపై, ఏపీపీఎస్సీ నియామకాల్లో జరిగిన తీవ్ర అక్రమాలపై అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే కట్టబెట్టి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆ పార్టీ అనుసరిస్తున్న విధ్వంసకర రాజకీయాలకు, దాడులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా ప్రజలు తిరస్కరించినప్పుడే వారి ఆరోపణలకు సరైన, నిజమైన సమాధానం లభిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.