- యువతి మృతికి కాంట్రాక్ట్ అధ్యాపకుడే ప్రధాన నిందితుడు
- యువతి అనుమానాస్పద మృతి కేసు ఛేదించిన పోలీసులు
- పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
- కారు, ఫోన్లు, ట్యాబ్ స్వాధీనం
- వివరాలు వెల్లడించిన డిసిపి ఏసీపీ మడత రమేష్
పెద్దపల్లి మహా,
గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి దర్యాప్తు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసులో సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న జెట్టి నవీన్ కుమార్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు, సింగరేణి సంస్థలో ఓవర్‌మన్ గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్ ను ఓసీపీ-05 గని వద్ద అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు, పెద్దపల్లి డీసీపీ పర్యవేక్షణలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా దృశ్యాలు, కాల్ డేటా, కాల్ రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుల కదలికలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
*వివరాల్లోకి వెళ్తే..*
2022లో పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న యువతి తో నవీన్ కుమార్‌కు పరిచయం ఏర్పడింది. అనంతరం అది సన్నిహిత సంబంధంగా మారినట్లు తెలిపారు. యువతి డిప్లొమా పూర్తిచేసి హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీటెక్ మైనింగ్ చదువుతున్న సమయంలో శిక్షణ కోసం గోదావరిఖని కి వచ్చినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో ఆమెకు రవికుమార్ తో పరిచయం ఏర్పడిందని
యువతి రవికుమార్ తో సన్నిహితంగా మెలగడాన్ని నవీన్ కుమార్ తట్టుకోలేక ఆమె పై కక్ష పెంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో యువతిని హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.
సెప్టెంబర్ 12న శనివారం పురుగుల మందును నీటి సీసాలో నింపుకుని కారులో ఉంచుకున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్స్ వద్ద ఆటోలో వెళ్తున్న యువతిని కారులో ఎక్కించుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం వివిధ ప్రాంతాల్లో కారులో తిప్పుతూ ఆమెతో వాగ్వాదానికి దిగినట్లు ఆపైన రవికుమార్ తన పై అత్యాచారం చేశాడని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంటూ యువతితో సూసైడ్ నోట్ రాయించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమెతో పురుగుల మందు తాగించిన పిదప
యువతి స్పృహ కోల్పోయిన వెంటనే ఆసుపత్రికి తరలించకుండా జాప్యం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో నిందితుడు వెల్లడించారు. అనంతరం ఆమె మొబైల్ నుంచి తండ్రికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. రాత్రి యువతిని ఇంటికి తీసుకెళ్లి, ఆమె తల్లిదండ్రుల తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చికిత్స పొందుతూ యువతి మరుసటి రోజు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
యువతి మృతి అనంతరం ఆధారాలు మాయం చేసేందుకు కారును కడిగినట్లు, సూసైడ్ నోట్, పురుగుల మందు సీసా, సిమ్ కార్డులను తొలగించిన అనంతరం హైదరాబాద్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో ఏ-1గా జెట్టి నవీన్ కుమార్, ఏ-2గా బొమ్మకంటి రవికుమార్ ను పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి ఎకోస్పోర్ట్ కారు, రెండు సెల్‌ఫోన్లు, ఒక ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసులో రవికుమార్ పాత్ర పై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.








