Mahaa Daily Exclusive

  పెళ్లైన 18 రోజులకే నవ వధువు సూసైడ్..

Share

  • పెళ్లైన 18 రోజులకే నవ వధువు సూసైడ్
  • వరకట్న వేధింపులే కారణం
  • ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలో ఘటన
  • వరుడు పోలీసు కానిస్టేబుల్

హైదారాబాద్, మహా : పెళ్లి బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ యువతి.. వివాహమైన 18 రోజులకే ప్రాణాలు కోల్పోయింది. అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురి చేయటంతో కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి-భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన ఏనుగు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పల్లవిని ఘనపూర్‌లోని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఈ ఏడాది ఆగస్టు 30న చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌రెడ్డితో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొంతకాలం కాలేజీకి వెళ్లకుండా ఉన్న పల్లవి సెప్టెంబర్‌ 17న తిరిగి తరగతులకు హాజరైంది.

వివాహం జరిగిన కొద్దిరోజులకే అదనపు కట్నం కోసం భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని పల్లవి కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. కట్నం, కానుకలకు సంబంధించిన విషయాల్లో కూడా ఆమెపై ఒత్తిడి ఉన్నట్లు తెలిసింది. సెప్టెంబర్‌ 18న ఉదయం పల్లవి కళాశాలకు వెళ్లింది. సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో కళాశాల భవనం నుంచి కిందపడినట్లు సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు వైద్యులు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

పల్లవి తల్లి సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త వేధింపులే ఘటనకు కారణమయ్యాయా ? కళాశాలలో ఏం జరిగింది ? ఘటనకు ముందు పల్లవి ఎవరితో మాట్లాడింది ? అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలతో పాటు కళాశాల సీసీటీవీ దృశ్యాలు, ఫోన్‌ వివరాలు, పోస్టుమార్టం నివేదిక వంటి అంశాలు దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి.