Mahaa Daily Exclusive

  బాట్ బ్రో కంపెనీ పేరుతో కారేపల్లి యువకుడి భారీ మోసం….

Share

బాట్ బ్రో కంపెనీ పేరుతో కారేపల్లి యువకుడి భారీ మోసం…
*ఎంఎల్ఎం స్కీమ్ పేరుతో వంద కోట్లు కాజేసిన వంచకుడు
*పోలీసులు అరెస్ట్ చేశారు… బెయిల్ పై వచ్చి దర్జాగా తిరుగుతున్నాడు
*న్యాయం చేస్తామన్న మధ్యవర్తి చేతులెత్తేశారు
*డబ్బు తిరిగి చెల్లిస్తానని వందమందికి రాసిచ్చిన బాండ్లు ఓ మహిళా లీడర్ వద్దే ఉన్నాయి
*న్యాయం చేయాలంటున్న బాధితులు

కారేపల్లి, మహా: అధిక వడ్డీలు రెట్టింపు లాభాలను మాయ మాటల్లో చూపి దుబాయ్ కేంద్రంగా ఉన్న బాట్ బ్రో అనే కంపెనీలో వందలాది మందితో పెట్టుబడులు పెట్టించి కోట్లాది రూపాయలను కాజేశాడు కారే పెళ్లికి చెందిన ఓ ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువకుడు. ఐఐటి చదివిన ఈ యువకుడు తన మేదస్సును తప్పుడు మార్గంలో పెట్టి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడాన్ని కూడా ఆసరాగా మలుచుకుని భారీ అక్రమానికి పాల్పడ్డాడు. ఈ అక్రమం పై కొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారేపల్లికి చెందిన ఈ యువకునితో పాటు మరో ముగ్గురిని ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేసి గతంలోనే రిమాండ్ కు తరలించారు. మూడు నెలల పాటు జైలు లో ఉండి బెయిల్ పై వచ్చిన యువకుడు మాత్రం దర్జాగా బయట తిరుగుతున్నాడని మోస పోయిన బాధితులు వాపోతున్నారు.
*ఫోరెక్స్ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ తో చీటింగ్….
దుబాయ్ కేంద్రంగా నిర్వహిస్తున్న బాట్ బ్రో కంపెనీ షేర్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తూ భారీ లాభాలను ఆర్జిస్తుందని మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీం పేరుతో మార్కెట్లో లాభాలు గడిస్తుందని…పెట్టుబడులు పెట్టిన వారు లక్షకు ఎనిమిది వేల రూపాయల చొప్పున వడ్డీ నెల వారీ అకౌంట్ లోనే డ్రా చేసుకోవచ్చని, పెట్టుబడి కూడా ఎప్పుడు అవసరమనిపిస్తే అప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చని నమ్మబలికి మొదటి ఆరు నెలల వరకు చెప్పిన విధంగానే వడ్డీలు చెల్లించారు. మంచి లాభాలు వస్తున్నాయనే నమ్మకంతో ఇప్పటికే చేరిన వారు రెట్టింపు డిపాజిట్లు చేయడం, వీటిని చూసి వారి బంధువులు స్నేహితులు కూడా భారీగా డిపాజిట్లు చేయడంతో కంపెనీ వేలకోట్లను పోగు చేసి బోర్డు తిప్పేసింది.
*తెలంగాణ జిల్లాల్లో కారేపల్లి యువకుడే కీలకం…
దుబాయ్ కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ కంపెనీకి ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రానికి చెందిన యువకుడే కీలక సూత్రధారి గా ఉండి భారీగా డిపాజిట్లు చేయించాడు. కొత్తగూడెం కు చెందిన ఓ ఫారెస్ట్ ఉద్యోగి పాతిక లక్షలు డిపాజిట్ చేసి సంస్త బోర్డు తిప్పేసిందని తెలియడంతో అనారోగ్యపాలయాడు. రఘునాథం పాలెం కు చెందిన 15 మంది మధ్యతరగతి యువకులు ఈ వంచ కుడి వలలోపడి పుస్తేలతాళ్లు కూడా కుదవపెట్టి డిపాజిట్ చేసి మోసపోయారు. ఖమ్మం పట్టణంలోనే సుమారు వందమంది దాకా పెట్టుబడులు పెట్టి నష్టపోయారు…
*బాధితులు నిలదీయగా ఓ మహిళా లీడర్ వద్ద సెటిల్ మెంట్…
చీటింగ్, ఆర్ధిక నేరాల కేసులో అరెస్టు అయి బెయిల్ పై వచ్చిన యువకుడు వాయిదాలకు కోర్టుకు వచ్చే సమయంలో కోర్టు ఆవరణ బయట నిలదీయడంతో ఇబ్బంది పెడుతున్న వారికి డబ్బు తిరిగి చెల్లిస్తానని దానికి తగిన సమయం కావాలని ఖమ్మం కు చెందిన ఓ మహిళా పాలిటికల్ లీడర్ వద్ద సెటిల్ మెంట్ కు కూర్చోబెట్టాడు. సుమారు వంద మంది బాధితులు వంద రూపాయల బాండ్ పేపర్లు తీసుకుని వెళ్లగా వాటిపై సంతకాలు పెట్టీ ఆ బాండ్లన్నీ కూడా మహిళా లీడర్ వద్దే ఉంచారు. ఒప్పందం ప్రకారం ఈ నెల మొదటి వారంలో డబ్బు చెల్లించాల్సి ఉంది. బాధితులు మహిళా లీడర్ ను ఆశ్రయించగా ఆమె కూడా చేతులెత్తేసినట్లు సమాచారం
*ఖమ్మం పట్టణంలోనే కోట్ల విలువైన ఆస్తులు …
డిపాజిట్ల పేరుతో వందలాది మంది నుంచి సేకరించిన డబ్బుతో కారేపల్లి కి చెందిన యువకుడు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు బాధితులు పేర్కొంటున్నారు. పాపటపల్లి సమీపంలో వ్యవసాయ భూమి, ఎస్ఎఫ్ఎస్ ఏరియాలో విలువైన ప్లాట్లు, ఖమ్మం నగరంలో మూడు భవనాలు, ఇతర ప్రాంతాల్లో కూడా అనేక ప్రాపర్టీలను కొనుగోలు చేసి వందలాది మందిని మోసం చేశాడు. కొన్ని ఆస్తులు అతని పేరుతో కొన్ని బినామీల పేర్లతో కొనుగోలు చేసి చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకుంటూ దర్జాగా తిరుగుతున్నాడు. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.