శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
• నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు.
• గరుడసేవకు భారీ ఏర్పాట్లు.
తిరుమల, మహా:
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి తిరుమలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం ఆలయ యాగశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంతో తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ముందుగా సేనాధిపతి శ్రీ విష్వక్సేనుల వారి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. నాలుగు మాడ వీధుల్లో విష్వక్సేనుల వారు విహరించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
భూదేవి అనుగ్రహం కోరుతూ మేదినీ పూజ
విష్వక్సేనుల వారి ఉత్సవం అనంతరం రాత్రి యాగశాలలో మేదినీ పూజ, మృత్సంగ్రహణం నిర్వహించారు. భూదేవిని ప్రసన్నం చేసుకుని పుట్టమన్నును సేకరించే ఈ ప్రక్రియలో భూసూక్తాన్ని పఠించారు. అనంతరం తొమ్మిది మట్టి కుండలను సిద్ధం చేసి వాటిలో పుట్టమన్నును నింపారు.
నవధాన్యాల బీజవాపనం
పాలికలుగా పిలిచే తొమ్మిది మట్టి కుండల్లో నవధాన్యాలను విత్తారు. గోధుమలను సూర్యునికి, బియ్యాన్ని చంద్రునికి ప్రతీకలుగా భావిస్తూ కందులు, పెసలు, శనగలు, అలసందలు, నువ్వులు, మినుములు, ఉలవలు తదితర ధాన్యాలను విత్తనాలుగా ఉపయోగించారు. అష్టదిక్పాలకులతో పాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేసి ఓషధీ సూక్తాలను పఠించారు.
సూర్యాస్తమయం తర్వాతే ఈ ఘట్టం
నవధాన్యాల బీజవాపనం సూర్యాస్తమయం తర్వాత నిర్వహించడం వెనుక ఆగమ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. చంద్రుడు సస్యకారకుడిగా భావించడంతో రాత్రి వేళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మొలకెత్తే ధాన్యాల ద్వారా బ్రహ్మోత్సవాలు సస్యశ్యామలంగా, సమృద్ధిగా సాగాలని సంకల్పిస్తారు.
నేడు ధ్వజారోహణం
బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం నేడు సాయంత్రం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.21 నుంచి 6.35 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరగనుంది. గరుడ పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించే ఈ కార్యక్రమంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి.
సీఎం దంపతుల చేతుల మీదుగా పట్టువస్త్రాల సమర్పణ
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు నేడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇదే సందర్భంగా తిరుమలలోని యాత్రికుల అనుభవ కేంద్రం, మ్యూజియంను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
గరుడసేవకు ప్రత్యేక ప్రాధాన్యం
ఈ నెల 19న జరిగే గరుడసేవ బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన ఘట్టం. రాత్రి 6.30 గంటల సమయంలో జరిగే గరుడసేవకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. 22న రథోత్సవం, 23న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
భక్తుల కోసం అదనపు ఏర్పాట్లు
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈసారి గతంతో పోలిస్తే 30 శాతం అదనపు ఏర్పాట్లు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో రవిచంద్ర తెలిపారు. ముఖ్యంగా గరుడసేవ రోజున అన్నప్రసాదాల తయారీని 38 శాతం పెంచుతున్నారు. భక్తులకు అందించే టీ, కాఫీ, మజ్జిగ సరఫరాను 50 శాతం మేర పెంచేలా ఏర్పాట్లు చేశారు.
రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలను కూడా పెంచుతున్నారు. అదనంగా 500 బస్సు ట్రిప్పులను నడపాలని నిర్ణయించడంతో మొత్తం 3,100 బస్సు ట్రిప్పులు అందుబాటులో ఉండనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, వసతి, తాగునీరు, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.








