Mahaa Daily Exclusive

  బీఆర్‌ఎస్‌.. బీజేపీ లు దొందు దొందే..

Share

  • బీఆర్‌ఎస్‌.. బీజేపీ లు దొందు దొందే
  • దళితులను మోసం చేసిన కేసీఆర్
  • దళిత స్పీకర్‌ ను అవమానించడం దారుణం
  • హ‌న్మ‌కొండ డీసీసీ అధ్య‌క్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి

హ‌నుమకొండ, మహా;

బీఆర్‌ఎస్‌ బీజేపీ పార్టీలు దొందు దొందేనని బిఆర్ఎస్ ను బిజెపి అనుసరిస్తోందని, దళిత స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ను అవమానించేలా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు వ్యవహరించడం సిగ్గుచేటు క్షమించరాని నేరమని కాంగ్రెస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. దళితుల పై వివక్షకు పాల్పడుతున్న బీఆర్‌ఎస్ తీరును ప్రజలు నిషితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ నాయకుల పై ఆయన నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ ప్రాంతంలో దళితులు నడిచిన నేలను బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అనాగరిక చర్య అని అభివర్ణించారు. అంటరానితనాన్ని ప్రోత్సహించేలా, మూఢనమ్మకాలను వ్యాప్తి చేసేలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
కేసీఆర్‌ మొదటి నుంచి దళిత వ్యతిరేక వైఖరితో వ్యవహరించారని ఇనగాల వెంకట్రామిరెడ్డి విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దళితులను దగా చేశారని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని మోసం చేశారని అన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రాజయ్య ను కారణం లేకుండా ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి దళితులను అవమానించారని ఆరోపించారు. మంత్రివర్గంలో మాదిగలకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పడం ద్వారా దళితుల పట్ల తన వైఖరిని కేసీఆర్‌ బయటపెట్టుకున్నారని విమర్శించారు. దళిత సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా తప్పించుకునేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద అనవసర రాద్ధాంతం చేశారని ఇనగాల వెంకట్రామిరెడ్డి విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ప్రజా సమస్యల పై మాట్లాడకుండా ఉండే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను, కేసీఆర్‌ ను ఏమనాలో వారి విజ్ఞతికే వదిలేస్తున్నామని ఎద్దేవా చేశారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులు, అధికారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం దారుణమని బీఆర్‌ఎస్‌ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌ ప్రభుత్వం సమర్థంగా తిప్పి కొడుతోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజా బలం ఉందని, ప్రతి ఇంటికీ 10కి పైగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,19,931తో దేశంలో 2వ స్థానంలో ఉందని, త్వరలో 1వ స్థానానికి చేరుతుందని ఇనగాల వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పాలనకు 41.1 శాతం ప్రజామోదం లభించిందని అన్నారు. ఆర్థిక, ఆరోగ్య సూచీల్లో రాష్ట్రం ముందుకు సాగుతున్నట్లు ప్రపంచ బ్యాంక్‌, కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్‌, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ధ్రువీకరించాయని తెలిపారు. దీనిని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం హేయమైన రాజకీయమని అన్నారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి డాక్టర్ కోటూరి మానవతారాయ్ వరంగల్, హన్మకొండ జిల్లాల పార్టీ అధికారిక ఇంఛార్జీ గా నియమితులైన సందర్భంగా ఇనగాల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మహమ్మద్‌ అయూబ్‌, పెరుమాండ్ల రామకృష్ణ, బందెల భద్రయ్య, ఆరూరి సాంబయ్య, వీసం సురేందర్‌ రెడ్డి, మహమ్మద్‌ రహమతుల్లా, హర్షం అశోక్‌, మేడారపు సుధాకర్‌ నేత, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.