Mahaa Daily Exclusive

  అంగన్‌వాడి లబ్ధిదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించాలి…

Share

  • అంగన్‌వాడి లబ్ధిదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించాలి
  • జిల్లాలో పోషణ మాసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
  • వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్, కలెక్టరేట్ మహా ;

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు మరింత నాణ్యమైన సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన మార్గదర్శకాలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల పోషణ, ఆరోగ్యం, సంరక్షణపై గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లతో జిల్లా కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, సూపర్‌వైజర్లు కేంద్రాలను సందర్శిస్తున్న తీరుతెన్నులు, లబ్ధిదారులకు అందుతున్న సేవల నాణ్యత తదితర అంశాలపై సమీక్షించారు.
క్షేత్రస్థాయిలో సూపర్‌వైజర్లు గుర్తించిన అంగన్‌వాడీ కేంద్రాల సమస్యలు, మౌలిక వసతుల లోటుపాట్లు, సేవలలో ఉన్న అంతరాలను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తూ, ప్రతి అంగన్‌వాడీ కేంద్రం సక్రమంగా పనిచేసేలా సూపర్‌వైజర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచడంతో పాటు పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు.

పోషణ మాసం పై అవగాహన

ఈ సందర్భంగా పోషణ మాసం–2026 పోస్టర్ల ను జిల్లా కలెక్టర్‌ డాక్టర్ సత్య శారద ఆవిష్కరించారు.
జిల్లావ్యాప్తంగా పోషణ మాసం కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి ప్రజల్లో పోషకాహారం, ఆరోగ్యం, శిశు సంరక్షణ, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించాలని సూపర్‌వైజర్లకు సూచించారు.
ప్రతి అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను నిర్వహించాలని, గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహారం ప్రాధాన్యతను వివరించాలని తెలిపారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమతుల్యమైన పోషకాహారం అందించడం, పిల్లల ఎదుగుదల, ఆరోగ్య సంరక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.
పోషణ మాసం కార్యక్రమాలు కేవలం అంగన్‌వాడీ కేంద్రాలకే పరిమితం కాకుండా గ్రామాలు, కమ్యూనిటీ స్థాయిలోనూ విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, సంబంధిత శాఖల సహకారం తీసుకోవాలని
సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి, సీడీపీవో, జిల్లా పోషణ్‌ అభియాన్‌ కోఆర్డినేటర్‌ పాల్గొని పోషణ మాసం–2026 ఉద్దేశ్యం, సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించనున్న రోజువారీ కార్యక్రమాలు, ప్రధాన అంశాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వివరించారు.

పోషణ మాసం సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామాలు, కమ్యూనిటీ స్థాయిలో ఆహార వైవిధ్యం, ప్రోటీన్‌ అధికంగా ఉండే ఆహారం, తాజా వేడి వండిన భోజనం, బాలల పోషణ, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ప్రధానమంత్రి మాతృ వందన యోజన తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

“మన అంగన్‌వాడీ – మన బాధ్యత”

“మన అంగన్‌వాడీ – మన బాధ్యత” అనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికారులు తెలిపారు. ప్రతి కుటుంబంలో పోషణ, ఆరోగ్యం, శిశు సంరక్షణపై అవగాహన పెంపొందించడం, అంగన్‌వాడీ కేంద్రాలను ప్రజలకు మరింత చేరువ చేయడం పోషణ మాసం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

పోషణ మాసం కార్యక్రమాల అమలును సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించి, ప్రతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు.
ఈ కార్యక్రమంలో డీడబ్ల్యు ఓ రాజమణి, సీడీపీవో లు, సూపర్వైజర్ లు పాల్గొన్నారు.