వాట్సప్ చూడటానికి ఉన్న శ్రద్ధ.
* ఫైళ్లు క్లియర్ చేయడంలో లేదా?
* 24 గంటల్లో పూర్తి చేయాల్సిన ఫైళ్లు 10 రోజులైనా పెండింగ్లోనా?
* ప్రజల పనులు ఆలస్యం చేయొద్దు.
* టెక్నాలజీతో పాలన వేగవంతం చేయాలి: చంద్రబాబు
అమరావతి, మహా .
ప్రజలకు అందాల్సిన సేవల్లో జాప్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వాట్సప్ సందేశాలు చూసేందుకు అధికారులు చూపుతున్న శ్రద్ధ.. ప్రజలకు సంబంధించిన దస్త్రాలను పరిష్కరించడంలో ఎందుకు కనిపించడం లేదని కలెక్టర్లు, శాఖల కార్యదర్శులను ఆయన నిలదీశారు. ఈ-ఫైళ్లను 24 గంటల్లోనే పరిష్కరించాలని గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. కొన్ని శాఖల్లో 10 రోజుల వరకు ఫైళ్లు పెండింగ్లో ఉండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫైళ్లు కార్యాలయాల్లో పెండింగ్లో ఉంటే అభివృద్ధి పనులు కూడా నిలిచిపోతాయని హెచ్చరించారు.
అమరావతి సచివాలయంలో గురువారం ప్రారంభమైన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు ఈ-గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలకే పరిమితం కాకుండా నిర్ణయాలను వేగంగా అమలు చేసి క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు.
‘‘ప్రజల పనులు ఆలస్యం కాకూడదు. టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుని వేగవంతమైన పాలన అందించాలి. ఫైల్ క్లియరెన్స్ సగటు 10 రోజుల నుంచి 2 రోజులకు తగ్గిందంటే అది నిరంతర పర్యవేక్షణ వల్లే సాధ్యమైంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సగటున 10 గంటల్లోనే ఫైళ్లను పరిష్కరిస్తున్నారని ఉదహరిస్తూ.. అదే వేగాన్ని మిగిలిన అధికారులు కూడా ప్రదర్శించాలని సూచించారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో కూడా జాప్యానికి తావు ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంతో పాటు ప్రజల సమస్యలను మానవీయ కోణంలో అర్థం చేసుకుని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ సేవలను వేగంగా అందించడం వల్ల అవినీతి, దుర్వినియోగం, జాప్యాన్ని తగ్గించవచ్చని గతంలోనూ ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రెండో రోజు సదస్సులో ఈ-గవర్నెన్స్, ఆర్టీజీఎస్, ఈ-ఆఫీస్లో పెండింగ్ ఫైళ్లు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, డేటా లేక్, అవేర్, వాట్సప్ ద్వారా పౌర సేవల అందజేతపై ముఖ్యమంత్రి సమీక్షించారు. జిల్లాల వారీగా ప్రభుత్వ పనితీరు, పథకాల అమలు, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాన్ని కూడా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటికి సత్వర పరిష్కారం చూపేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సూచించారు.
స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలను చేరుకోవడంలో జిల్లాలే కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు అన్నారు. ప్రతి జిల్లాకు నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఆర్థిక వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పన, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాల్లో జిల్లా యంత్రాంగం క్రియాశీలంగా పనిచేయాలని ఆదేశించారు.
ప్రజలకు అవసరమైన తాగునీటి వసతుల కల్పనపైనా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. జలధార కార్యక్రమం పురోగతిని సమీక్షిస్తూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పెట్టుబడులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సంక్షేమ పథకాలు, మానవాభివృద్ధి అంశాల్లోనూ జిల్లాల పనితీరును మెరుగుపర్చాలని కోరారు.
అధికారులు కేవలం ఫైళ్లను కదిలించే స్థాయిలో కాకుండా నిర్ణయాలు తీసుకునే నాయకత్వ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని చంద్రబాబు సూచించారు. సమీక్షల నుంచి ఫలితాల సాధన దిశగా పాలనా వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు, ఉద్యోగుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయవచ్చని పేర్కొన్నారు.
సదస్సులో భూ పరిపాలన, కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వినియోగం, జిల్లాల ర్యాంకింగులు, నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, శాంతిభద్రతలు తదితర అంశాలపైనా చర్చించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను కలెక్టర్లు నేరుగా సీఎంకు వివరించేలా ఓపెన్ ఫోరమ్ నిర్వహించారు. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం మరింత పెరిగేలా పాలనలో వేగం, పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు.








