- పార్టీ పేరు, జెండా, విధివిధానాలపై క్లారిటీ ఇచ్చిన విజయసాయిరెడ్డి
- విజయవాడ వేదికగా పూర్తి వివరాలను వెల్లడిస్తా
- ప్రజల గొంతుక వినిపించేందుకు ప్రతిపక్ష హోదా అక్కర్లేదని వ్యాఖ్య
విజయవాడ, మహా : తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి ఆయన సోమవారం మరింత స్పష్టత ఇచ్చారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు మరియు పూర్తి ప్రణాళికను విజయవాడ వేదికగా అధికారికంగా వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు.
ప్రజాసమస్యలపై పోరాడేందుకు, ప్రజల తరఫున గొంతుక వినిపించేందుకు చట్టసభల్లో ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఏమీ అవసరం లేదని విజయసాయి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ మాత్రమే ఏకైక ప్రతిపక్షంగా ఉందని పేర్కొన్నారు. సాధారణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, వారి సమస్యలను నేరుగా సభల వరకు తీసుకెళ్లేందుకు ఒక బలమైన స్వతంత్ర రాజకీయ వేదికను ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని తెలిపారు.
ఒకప్పుడు వైసీపీలో కీలక పాత్ర పోషించి జగన్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్న విజయసాయి ఆ తర్వాత పార్టీని వీడిన విషయం తెలిసిందే. పార్టీని వీడిన సమయంలో తాను రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతున్నట్లు ప్రకటించి కొన్నాళ్లు స్థబ్ధుగా ఉన్న విజయసాయి ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.







