• అమరావతి–బెంగళూరు–చెన్నై బుల్లెట్ రైలు కారిడార్.
• దక్షిణాది విద్యుత్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో అనుసంధానించాలి: సీఎం చంద్రబాబు
చెన్నై, మహా.
వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది రాష్ట్రాలు కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, కేంద్ర–రాష్ట్రాల మధ్య విశ్వాసం, సమన్వయంతోనే దక్షిణాది సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో చంద్రబాబు పలు కీలక ప్రతిపాదనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులను అనుసంధానిస్తూ అమరావతి–బెంగళూరు–చెన్నై నగరాల మధ్య బుల్లెట్ రైలు కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు. కుప్పం మీదుగా ఈ రవాణా మార్గాన్ని అభివృద్ధి చేస్తే మూడు రాష్ట్రాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక అనుసంధానం మరింత బలోపేతమవుతుందని వివరించారు. వేగవంతమైన రవాణా వ్యవస్థతో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
దక్షిణాది కోసం ఉమ్మడి ప్రణాళికలు
దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉమ్మడి సరకు రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రై పోర్టులను ఏర్పాటు చేసి సరకు రవాణా వ్యయాన్ని తగ్గించాలని సూచించారు. దక్షిణాది విద్యుత్ గ్రిడ్‌ను జాతీయ విద్యుత్ గ్రిడ్‌తో మరింత సమర్థంగా అనుసంధానించాలని కోరారు.
దక్షిణాది రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలను అనుసంధానిస్తూ ఉమ్మడి సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని సూచించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రం తక్షణ సహాయం అందించేలా ఉమ్మడి సహాయక దళాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు.
ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త మార్గం
తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్‌ధామ్ వరకు అనుసంధానించే ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక మార్గాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను చంద్రబాబు కోరారు. దక్షిణాది నుంచి ఉత్తర భారతంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరిస్తే పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని అన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర అత్యంత కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. దేశ స్థూల దేశీయోత్పత్తిలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31 శాతం ఉందని గుర్తుచేశారు. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ పది లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విభజన సమస్యలకు పరిష్కారం చూపాలి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజన సమస్యలు 12 ఏళ్లుగా కొనసాగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. వాటి పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను పరిష్కరించడంతోపాటు వనరుల లోటును భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
పోలవరం, దక్షిణ కోస్తా రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులు కేంద్ర సహకారంతో ముందుకు సాగుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా సాధించామని గుర్తుచేశారు. విభజన చట్టంలోని 56వ సెక్షన్‌కు సంబంధించిన అంశాలను కూడా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు.
విశాఖ, విజయవాడ మెట్రోకు అనుమతులు
దుగ్గరాజపట్నం ఓడరేవు, రిఫైనరీ ప్రతిపాదనలకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని చంద్రబాబు కోరారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కడప–జేఎస్‌డబ్ల్యూ రైల్వే అనుసంధానానికి కూడా కేంద్రం నుంచి అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
గోదావరి–కావేరి అనుసంధానంపై దృష్టి
గోదావరి–కావేరి నదుల అనుసంధానం ద్వారా 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలైతే తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు నదీ జలాల విషయంలో సమన్వయంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
గంగా–కావేరి నదుల అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక రూపొందించాలని కోరారు. నదుల అనుసంధాన ప్రాజెక్టులకు కాలపరిమితితో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, అవసరమైన అనుమతులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరారు.
చంద్రబాబు విజన్‌పై సీఎంల ప్రశంసలు
దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయంతోనే ప్రాంతీయ ప్రగతి సాధ్యమవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రతిపాదనలు సమావేశంలో చర్చకు వచ్చాయి. చంద్రబాబు ప్రసంగాన్ని పలువురు ముఖ్యమంత్రులు ప్రశంసించారు. సీనియర్ నాయకుడిగా విశాల దృక్పథంతో అన్ని దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు మాట్లాడారని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అభినందించారు.
దక్షిణాది రాష్ట్రాలు ఒక్కొక్కటిగా అభివృద్ధి చెందడం కంటే పరస్పరం అనుసంధానమై సమష్టిగా ముందుకు సాగితే దేశ ఆర్థికాభివృద్ధికి మరింత బలమైన చోదకశక్తిగా మారగలవన్నది ఈ సమావేశంలో చంద్రబాబు ప్రతిపాదనల సారాంశంగా నిలిచింది.








