* అధికారులా.. రాజకీయ నాయకులా?
* నిమజ్జనానికి నీళ్లూ ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం.
* సజ్జనార్‌పై కౌశిక్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.
హైదరాబాద్, మహా.
వినాయక నిమజ్జనం వేళ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ సజ్జనార్ చేసిన హెచ్చరికలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. కేసీఆర్‌కు సంబంధించిన పాటలు నిమజ్జన కార్యక్రమాల్లో వినిపిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు రాజకీయ నాయకుల మాదిరిగా వ్యవహరించవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గంలో నిమజ్జన ఏర్పాట్లపై ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. అదే సమయంలో దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ కాంగ్రెస్, బీజేపీలపై రాజకీయ విమర్శలు గుప్పించారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కౌశిక్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
సజ్జనార్‌పై కౌశిక్‌రెడ్డి ఆగ్రహం
కేసీఆర్ పాటలు పెట్టడంపై నిషేధాలు విధించడానికి సజ్జనార్ ఎవరు అని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. సజ్జనార్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఆయన ఏమైనా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారా అంటూ ప్రశ్నించారు. బ్రేక్ ఎప్పుడు తీసుకోవాలి, లంచ్ ఎప్పుడు చేయాలి అనే విషయాలను కూడా ఆయనే చెబుతారా అంటూ అధికారుల తీరుపై విమర్శలు చేశారు.
నిమజ్జన ఏర్పాట్లపై ప్రభుత్వాన్ని నిలదీత
హుజూరాబాద్ నియోజకవర్గంలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం కోసం నీటి వసతి కల్పించాలని మంత్రి నుంచి అధికారుల వరకు కోరినా స్పందన రాలేదని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. కనీసం నీటి వసతి కూడా కల్పించని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. విగ్రహాలను ముక్కలు చేసి నిమజ్జనం చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని అన్నారు.
ప్రభుత్వ పనితీరు చూస్తుంటే కాంగ్రెస్‌కు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు.
దానం నాగేందర్ అనర్హత కోసం బీఆర్ఎస్ న్యాయ విభాగం 2024 మార్చి 24 నుంచి పోరాడుతోందని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. హైకోర్టులో దాఖలైన పిటిషన్లలో కౌశిక్‌రెడ్డి కూడా పిటిషనర్‌గా ఉన్నారు. హైకోర్టు నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించిన తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దానం నాగేందర్ వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. మిగిలిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీజేపీ ఎందుకు అదే స్థాయిలో న్యాయపోరాటం చేయలేదని ప్రశ్నించారు. రెండున్నరేళ్ల పోరాటం తర్వాత దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడితే ఇప్పుడు దాని ఘనతను బీజేపీ నేతలు తమ ఖాతాలో వేసుకోవడం సరికాదని విమర్శించారు.
హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని దానం నాగేందర్ చెప్పి, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారని కౌశిక్‌రెడ్డి విమర్శించారు.
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరిని కూడా కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏం చేస్తారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ప్రజల తీర్పు కోరాలని డిమాండ్ చేశారు.
దానం నాగేందర్ తర్వాత పార్టీ మారిన మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు తప్పదని కౌశిక్‌రెడ్డి అన్నారు. త్వరలోనే ఆ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.








