* గురువులపై దాడులకు అసాంఘిక శక్తులను తీసుకొస్తారా?
*’ఈడీ దర్యాప్తు భయంతోనే వైసీపీ కొత్త నాటకాలు.
• మాజీ సీఎం జగన్పై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర ధ్వజం.
తెనాలి, మహా.
రాష్ట్రంలో డీఎస్సీ నియామకాలు, ఉపాధ్యాయుల సమస్యలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఆధారాలతో సహా శాసనసభకు వచ్చి చర్చించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సవాల్ విసిరారు. గురువారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వైసీపీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు ఎప్పుడూ తావుంటుందని, కానీ నిరసనల ముసుగులో నాలుగైదు జిల్లాల నుంచి అసాంఘిక శక్తులు, రౌడీషీటర్లను తీసుకొచ్చి గురువులపై దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి కనీస వ్యత్యాసం తెలియని జగన్.. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ తరహా మళ్లింపు రాజకీయాలకు తెరతీశారని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలాకు పెట్టిన వైసీపీ నాయకత్వానికి, ఇప్పుడు గురువుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగం పెరగడంతో, తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే వైసీపీ నేతలు ఈ కొత్త నాటకాలకు తెరలేపారని నాదెండ్ల ఆరోపించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అరాచకానికి, అవినీతికి రాజమార్గం వేశారని దుయ్యబట్టారు. ఆ కాలంలో సుమారు రూ.1.30 లక్షల కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగితే, అందులో కేవలం రూ.600 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీల ద్వారా జరగడం వెనుక ఉన్న మతలబు ఏమిటో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు నాసిరకం మద్యం సరఫరా చేసి సుమారు 30 వేల కుటుంబాల ప్రాణాలతో చెలగాటమాడారని, ఇప్పుడు ఈడీ దర్యాప్తులో ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తుండటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా అలజడులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే, రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనే ఏకైక దురుద్దేశంతోనే వైసీపీ కుట్రలు పన్నుతోందని మంత్రి విమర్శించారు. ప్రజల్లో అభద్రతా భావం, అయోమయం సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలన్నదే జగన్ వ్యూహమని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలపై ఏవైనా అభ్యంతరాలు లేదా లోపాలు ఉంటే చట్టసభల వేదికగా ప్రశ్నించాలని, అంతేకానీ వీధుల పాలై అల్లర్లు సృష్టించడం తగదని హితవు పలికారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకూ పక్కా ఆధారాలతో అసెంబ్లీ సాక్షిగా బదులిచ్చేందుకు ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వం అంతా సిద్ధంగా ఉందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.








