Mahaa Daily Exclusive

  మేం ఉగ్రవాదులం కాదు… బాధితులం.

Share

  •  ట్రంప్‌నకు ఇరాన్‌ అధ్యక్షుడు దీటుగా బదులు.
  •  యూఎన్‌ సర్వప్రతినిధి సభలో మసూద్‌ పెజెష్కియాన్‌ భావోద్వేగ ప్రసంగం.
  •  చిన్నారుల మృతదేహాలు, సమాధుల ఫొటోలు ప్రదర్శిస్తూ అమెరికా, ఇజ్రాయెల్‌ తీరుపై ఆగ్రహం.

న్యూయార్క్‌,మహా.

ఇరాన్‌ను ఉగ్రవాద దేశమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ వేదికగా అమెరికా ఆరోపణలను ఆయన ముక్తకంఠంతో తిప్పికొట్టారు. తాము ఉగ్రవాదులం కాదని, అమెరికా-ఇజ్రాయెల్‌ దురాక్రమణలకు, దాడులకు బలైన బాధితులమని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నిన్ననే ట్రంప్‌ మమ్మల్ని టెర్రరిస్టులంటూ నిందించారు. కానీ అసలు నిజం ఏమిటంటే.. మేం ఉగ్రవాద బాధితులం’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రసంగం సందర్భంగా అమెరికా సైనిక చర్యల్లో ధ్వంసమైన ఇరాన్‌లోని మినాబ్‌ పాఠశాల చిత్రాలను, ఆ దాడిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన పసిపిల్లల మృతదేహాలు, వారి సమాధుల ఫొటోలను సభలో ప్రదర్శిస్తూ పెజెష్కియాన్‌ భావోద్వేగానికి లోనయ్యారు. తమ సుప్రీం లీడర్‌ను సైతం అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని, ఎలాంటి పాపం తెలియని చిన్నారులపై అమెరికా, ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించాయని మండిపడ్డారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శత్రువులు తమపై ఎన్ని దాడులు చేసినా తాము ఎన్నడూ తలవంచలేదని, సర్వశక్తులు ఒడ్డి ఆత్మరక్షణ చేసుకుంటామని పెజెష్కియాన్‌ తేల్చిచెప్పారు. అయితే, ప్రత్యర్థి దేశాల పౌరులను తాము ఎన్నడూ లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌ తీరుపై నిప్పులు చెరిగిన ఆయన.. ఇరాన్‌లోని విశ్వవిద్యాలయాలు, వైద్య కేంద్రాలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి పౌర మౌలిక వసతులపై ప్రత్యర్థులే విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. శత్రువుల దాష్టీకానికి ప్రతిస్పందించినప్పటికీ, తాము ఎప్పుడూ సాధారణ ప్రజలకు హాని కలిగించలేదన్నారు. అత్యాధునిక ఆయుధాలతో రక్తపాతం సృష్టించిన వారే నేడు తమపై ఉగ్రవాదులనే ముద్ర వేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రాంతంలో నెలకొన్న అస్థిరతకు తాము కారణం కాదని, తమ ప్రజలు పూర్తి స్వతంత్రంగా, గౌరవప్రదంగా జీవించాలన్నదే తమ ఏకైక ఆకాంక్ష అని ఇరాన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు.