Mahaa Daily Exclusive

  జర్మనీలో అంబరాన్నంటిన ‘తెలుగు సంబరం’.

Share

* ఖండాంతరాల్లో ఘనంగా తెలుగువారి సాంస్కృతిక వేడుకలు.
* మాతృభాషను, మన మూలాలను ఎన్నటికీ మరువొద్దు.
* వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

జర్మనీ,మహా.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ జర్మనీ (ట్యాగ్) ఆధ్వర్యంలో ‘తెలుగు సంబరం 2026’ వేడుకలు జర్మనీలో అత్యంత వైభవంగా జరిగాయి. ఖండాంతరాల్లో స్థిరపడిన తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, మన మాతృభాష, సంస్కృతి, సంప్రదాయాల గొప్పదనాన్ని ఈ కార్యక్రమం ఘనంగా చాటిచెప్పింది. జర్మనీ నలుమూలల నుంచి తరలివచ్చిన వందలాది తెలుగు కుటుంబాలు, విద్యార్థులు, కళాకారులు ఈ సాంస్కృతిక పండుగలో అత్యుత్సాహంగా పాలుపంచుకున్నారు. తెలుగు భాషా సాహిత్యం, సంగీతం, నృత్యం, జానపద కళలు, సంప్రదాయ వేషధారణలతో సాగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భావితరాలకు మన వారసత్వాన్ని అందించాలనే సంకల్పంతో ట్యాగ్ చేస్తున్న కృషిని ఈ వేడుకలు ప్రతిబింబించాయి.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా వ్యవహరించారు. అనారోగ్య కారణాలతో ఆయన వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయినప్పటికీ, వర్చువల్ విధానంలో వేడుకలను ప్రారంభించి ప్రసంగించారు. మనిషి జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎక్కడ స్థిరపడినా తమ మూలాలను మరువకూడదని ఆయన ఉద్బోధించారు. తండ్రి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశం, గురువు.. ఈ ఐదింటినీ జీవితంలో ఎప్పుడూ విస్మరించరాదని హితవు పలికారు. జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశంలో ఆధునిక రంగాల్లో రాణిస్తూనే, తెలుగు వారు తమ ప్రాచీన సంస్కృతిని, మాతృభాషను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్న తీరు అత్యంత అభినందనీయమన్నారు. ఇళ్లలో పిల్లలతో తల్లిదండ్రులు తప్పనిసరిగా అమ్మభాషలోనే మాట్లాడాలని, అప్పుడే వారి ఆలోచనలకు ప్రాణం పోసిన వారవుతారని ఆయన సూచించారు. భవిష్యత్తులో గ్లోబల్ సిటిజన్లుగా ఎదిగే పిల్లలు సైతం భారతీయ మూలాలతో దృఢంగా అనుసంధానమై ఉండాలని ఆకాంక్షించారు. అలాగే, అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న భారత సంకల్పంలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకమని, నవతరం కృషితో దేశం ప్రపంచ గురువుగా ఎదుగుతోందని వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వేడుకల్లో భారత కాన్సులేట్ జనరల్ సుచిత కిషోర్, శాసనమండలి మాజీ సభ్యులు టీడీ జనార్దన్, ప్రముఖ సినీ హీరో నిఖిల్ సిదార్థ, నెక్కంటి నిషాంత్, వేగుంట మధుసూదన్ రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ప్రవాసంలో ఉన్నప్పటికీ తెలుగు వారి ఐక్యతను వారు కొనియాడారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన కృష్ణ జవ్వాజి, రామ్ బొల్లా, మోహన్ జొన్నలగడ్డలను నిర్వాహకులు ప్రతిష్టాత్మక పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ఈ వేడుకను విజయవంతం చేయడంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ జర్మనీ (ట్యాగ్) కార్యవర్గ సభ్యులు నరేష్ కోనేరు, సుమంత్ కోర్రపాటి, శ్రీకాంత్ కుడితిపూడి, శివ బత్తల, వంశీ దాసరి, వెంకట్ ఖండ్ర, దినేష్ కోవి, ఫర్హత్ మీర్జా, వంశీ ఉండవల్లి, అరవింద్ చౌదరి, లీల ధారపనేని, రవి తేజ ఖాజా, మనోజ్ గుట్లపల్లి, మహేంద్ర కొండ్రెడ్డితో పాటు ట్యాగ్ విద్యార్థి విభాగం విశేషంగా కృషి చేశారు.