Mahaa Daily Exclusive

  ఇజ్రాయెల్ భీకర దాడి.

Share

  •  హమాస్ ఆర్థిక విభాగం చీఫ్ మహమ్మద్ అబు అల్వాన్ హతం.
  •  ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ రక్షణ బలగాల సంయుక్త ఆపరేషన్.
  •  హమాస్ అంతమయ్యే వరకు పోరు ఆగదన్న ప్రధాని నెతన్యాహు.
  •  గాలిపటాలను సాకుగా చూపి దాడులు చేస్తున్నారన్న హమాస్.

    టెల్ అవీవ్,మహా:

గాజాలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన మెరుపు దాడిలో హమాస్ కీలక నేత ఒకరు నేలకొరిగారు. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్), ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక వ్యూహాత్మక ఆపరేషన్‌లో హమాస్ ఆర్థిక విభాగానికి నేతృత్వం వహిస్తున్న మహమ్మద్ అబు అల్వాన్ హతమైనట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. పక్కా నిఘా సమాచారంతో శత్రు మూలాలను ఛేదించిన సైనిక బలగాలను, భద్రతా సంస్థల సిబ్బందిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సంయుక్త ప్రకటనలో ప్రత్యేకంగా అభినందించారు.
గాజాలో హమాస్ ఉనికి సమూలంగా తుడిచిపెట్టుకుపోయే వరకు తమ సైనిక చర్యలు ఆగబోవని నెతన్యాహు, ఇజ్రాయెల్ కాట్జ్ తేల్చిచెప్పారు. హమాస్ నాయకులు, వారి ఆర్థిక వనరులు, సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. అక్టోబర్ 7 నాటి నరమేధం లాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే శత్రువుల వేళ్లను పూర్తిగా పెకిలించాల్సిందేనని, ఆ లక్ష్యం నెరవేరేంత వరకు సైనిక కార్యాచరణను ఉపసంహరించే ప్రసక్తే లేదని ప్రధాని నెతన్యాహు పునరుద్ఘాటించారు.
మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. గాజా నుంచి సరిహద్దుల మీదుగా ప్రయోగిస్తున్న డ్రోన్లు, పేలుడు పదార్థాలతో కూడిన గాలిపటాలు, బెలూన్ల దాడులను వెంటనే నిలిపివేయకపోతే ఆయా ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చేయించి విరుచుకుపడతామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అయితే, ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలను హమాస్ తీవ్రంగా తిప్పికొట్టింది. కేవలం అమాయక చిన్నారులు సరదాగా ఎగరేసే గాలిపటాలను సాకుగా చూపిస్తూ ఇజ్రాయెల్ సాధారణ ప్రజలపై దాడులను తీవ్రతరం చేస్తోందని, ఇది పసిపిల్లలను భయభ్రాంతులకు గురిచేయడమేనని హమాస్ అధికార ప్రతినిధి హజెమ్ ఖాసిమ్ ఆరోపించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిలబెట్టేందుకు ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ దేశాలు తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.