న్యూఢిల్లీ, మహా : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఈకే -514 విమానంలో వచ్చిన ఒక మహిళ, ఒక పురుష ప్రయాణికుడిని అనుమానంతో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అధికారులు గమనించారు. విమానాశ్రయంలోని బెల్ట్ నంబర్లు 12, 13 సమీపంలోని వాష్రూమ్ వెలుపల ఇద్దరూ మాట్లాడుకోవడాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం వారు గ్రీన్ ఛానెల్ ద్వారా బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అడ్డుకుని తనిఖీలు చేపట్టారు. మహిళా ప్రయాణికురాలి సామాను, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని అధికారులు తెలిపారు. అయితే పురుష ప్రయాణికుడిని తనిఖీ చేయగా మెటల్ డిటెక్టర్ బీప్ శబ్దం రావడంతో మరింత క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో మొత్తం 2,168 గ్రాముల బరువున్న 11 బంగారు బిస్కెట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వాటిలో పది 10-తులాల బంగారు బిస్కెట్లు, ఒక కిలో బరువున్న మరో బంగారు బిస్కెట్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ చట్టం, 1962 కింద అరెస్ట్ చేసి, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బంగారం తరలింపు వెనుక ఉన్న ఉద్దేశ్యం, సంబంధిత వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలు, ఇతరుల ప్రమేయం తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.







