Mahaa Daily Exclusive

  ఉద్యోగుల సభకు అనుమతి నిరాకరించడం దారుణం…

Share

  • ఉద్యోగుల సభకు అనుమతి నిరాకరించడం దారుణం
  • సభలకు అనుమతి కోసం ప్రతిసారీ కోర్టును ఆశ్రయించాలా?

హైదరాబాద్‌, మహా : ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సభలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించడం దారుణమని మాజీ ఎమ్మెల్సీ దేవీప్రసాద్‌ విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన కొనసాగుతోందా? లేక నిర్బంధాలు, అణిచివేతలు, అరెస్టులు, కేసులతో ఎమర్జెన్సీ తరహా పాలన సాగుతోందా? అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందన్నారు. సీపీఎస్‌ ఉద్యోగుల సభకు అనుమతి నిరాకరించడంతో పాటు బీఆర్‌ఎస్‌ నిర్వహించే సభలకు కూడా అనుమతులు ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమన్నారు.

ప్రజాస్వామ్యంలో సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు అని, ప్రతి కార్యక్రమానికి కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి రావడం సరికాదన్నారు. ఉద్యోగులు కొత్తగా ఏమీ కోరడం లేదని, కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలైన పీఆర్సీ, డీఏలు, ఉద్యోగుల ఆరోగ్య పథకం తదితర సమస్యలను పరిష్కరించాలని మాత్రమే కోరుతున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి మరో రెండేళ్ల వరకు పీఆర్సీ రాదని చెప్పడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో పాటు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రత్యర్థుల విషయంలో పోలీసు యంత్రాంగం అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ‘ఇందిరమ్మ పాలన’ అంటే నిర్బంధాలు, అరెస్టులు, కేసులు కాదని, ప్రజల సమస్యలు వినడం, ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడం, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించడమే నిజమైన ప్రజాపాలన అని దేవీప్రసాద్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లతో చర్చలు జరిపి మేనిఫెస్టో హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Latest