మెుత్తం 13 రోజుల పాటు హాలీడేస్
అక్టోబరు 10 నుంచి 22 వరకు సెలవులు
హైదరాబాద్, మహా : ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా పండుగ సందర్భంగా వరుసగా 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అకడమిక్ విద్యా క్యాలెండర్ ప్రకారం అక్టోబరు 10 నుంచి 22వ తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అధికారికంగా వెల్లడించింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు పండుగ సందర్భంగా సెలవులు లభించనున్నాయి. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 10 నుంచి 22 వరకు మొత్తం 13 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఉంటాయి. అయితే ఇందులో అక్టోబరు 10 రెండో శనివారం కాగా.. అక్టోబరు 11, 18 తేదీలు ఆదివారాలు కావడంతో సాధారణ సెలవు రోజులు కూడా ఉన్నాయి. వీటిని మినహాయిస్తే దసరా సెలవుల కారణంగా విద్యార్థులకు నికరంగా పది రోజుల సెలవు లభించనుంది.
మరోవైపు దసరా సెలవుల నేపథ్యంలో పాఠశాలల్లో నిర్వహించాల్సిన సమ్మెటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షల షెడ్యూల్‌ను కూడా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్ సీఈఆర్ టీ) ప్రకటించింది. అక్టోబరు 1వ తేదీ నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు ప్రారంభమై అక్టోబరు 9వ తేదీతో పూర్తయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. దీంతో దసరా సెలవులకు ముందే విద్యార్థుల మొదటి సమ్మెటివ్ పరీక్షలు పూర్తికానున్నాయి. పరీక్షల అనంతరం అక్టోబరు 10 నుంచి విద్యార్థులకు సెలవులు ప్రారంభమవుతాయి. అక్టోబరు 22 వరకు సెలవులు కొనసాగి.. అక్టోబరు 23 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దసరా సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ముందుగానే తమ ప్రయాణాలు, పండుగ కార్యక్రమాలను ప్రణాళిక చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా స్వగ్రామాలకు వెళ్లే కుటుంబాలు పరీక్షలు పూర్తయిన వెంటనే ప్రయాణ ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుంది.
అకడమిక్ క్యాలెండర్‌లో ముందుగానే నిర్దేశించిన ప్రకారమే సెలవులు అమలు చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా ఈ విద్యా క్యాలెండర్ ప్రకారం దసరా సెలవులను పాటించాల్సి ఉంటుందన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు దసరా పండుగ సందర్భంగా సుదీర్ఘ విరామం లభించనుంది.








