* టీడీపీలోకి జడ్పీటీసీల క్యూ.
* మజ్జి శ్రీనివాసరావు బాటలోనే ఐదుగురు జడ్పీటీసీల రాజీనామా.
* త్వరలోనే పచ్చ కండువా కప్పుకోనున్న స్థానిక ప్రజాప్రతినిధులు.
* స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లాలో మరింత బలహీనపడ్డ వైసీపీ.
విజయనగరం, మహా.
విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అత్యంత సమీప బంధువైన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో, ఆయన బాటలోనే పలువురు ప్రజాప్రతినిధులు సైకిలెక్కేందుకు సిద్ధమయ్యారు. చిన్న శ్రీను ముఖ్య అనుచరులుగా గుర్తింపు పొందిన ఐదుగురు జడ్పీటీసీ సభ్యులు బుధవారం మూకుమ్మడిగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. చీపురుపల్లి జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, గజపతినగరం జడ్పీటీసీ గార తవుడు, గంట్యాడ జడ్పీటీసీ వర్రి నరసింహమూర్తి, విజయనగరం జడ్పీటీసీ కెల్ల శ్రీనివాసరావు, కొత్తవలస జడ్పీటీసీ నెక్కల శ్రీదేవి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. అనంతరం తామంతా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రానున్న రోజుల్లో జిల్లా వైసీపీలో మరిన్ని కుదుపులు తప్పవని వారు హెచ్చరించారు.
ఇటీవల అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మజ్జి శ్రీనివాసరావు తన కుమార్తెతో కలిసి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. జిల్లా పరిషత్‌పై తిరుగులేని పట్టున్న చిన్న శ్రీను పార్టీని వీడటంతో జిల్లాలో వైసీపీ రాజకీయ పునాదులు ఒక్కసారిగా కదిలిపోయాయి. తాజాగా జడ్పీటీసీలు సైతం ఆయన వెంటే నడవాలని నిర్ణయించుకోవడంతో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు అధికార కూటమికి మరింత బలాన్ని చేకూరుస్తుండగా, ప్రతిపక్ష వైసీపీకి కోలుకోలేని దెబ్బగా మారాయి.
జిల్లావ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు సైతం పెద్ద ఎత్తున వైసీపీని వీడి టీడీపీ వైపు చూస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. బొత్స కుటుంబానికి కంచుకోటగా భావించే విజయనగరంలో కీలక నేతలంతా వరుసగా చేతులు మారుస్తుండటంతో క్యాడర్లో తీవ్ర నిరాశ నెలకొంది. రాబోయే రోజుల్లో మరిన్ని భారీ చేరికలు ఉంటాయన్న సంకేతాలతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.








