Mahaa Daily Exclusive

  ఉద్యోగులకు సర్కార్ దసరా కానుక.

Share

• రెండు డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్.
• ఉద్యోగ సంఘాల జేఏసీతో చర్చలు సఫలం.
• నాలుగు నెలల తర్వాత మరో డీఏ.
• ఈ నెలలోనే పీఆర్సీపై తేలనున్న నిర్ణయం.
• సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి ఉద్యోగ సంఘాల ధన్యవాదాలు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) జరిపిన కీలక చర్చలు ఫలప్రదమయ్యాయి. ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన రెండు కరువు భత్యాల (డీఏ) మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొదటి డీఏ కింద 3.64 శాతం, రెండో డీఏ కింద 2.74 శాతం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అంతేకాకుండా, రాబోయే నాలుగు నెలల వ్యవధిలోనే మరో డీఏను విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఉద్యోగులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) ప్రకటనపై సైతం ఈ నెలలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన జరిగిన జాయింట్ స్టాఫ్ కమిటీ సమావేశంలో ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని విస్తృతంగా చర్చించారు.
చర్చల అనంతరం సచివాలయం మీడియా పాయింట్ వద్ద తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ప్రధాన సమస్యలపై ఈ నెల 6న ఉద్యోగ సంకల్ప సభ నిర్వహించి, మొత్తం 68 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచామని గుర్తుచేశారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించి పరిష్కారానికి స్పష్టమైన మార్గం చూపిందని తెలిపారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
పీఆర్సీ కమిషన్ గడువును ఇక ఏమాత్రం పొడిగించకుండా నిర్దేశిత సమయంలోనే నివేదిక తెప్పించుకుని, వెంటనే పీఆర్సీని ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు లచ్చిరెడ్డి పేర్కొన్నారు. అధికారుల కమిటీ నివేదిక చేతికి రాగానే వేతన సవరణపై నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చిందని తెలిపారు. డీఏల ప్రకటన, పీఆర్సీపై సానుకూల నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.