Mahaa Daily Exclusive

  సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు.

Share

  •  హైకోర్టు విచారణపై స్టే అంశం నేటికి వాయిదా.
  •  హైకోర్టులో పెండింగ్‌ కేసుల వివరాలు ఇవ్వాలని ‘సుప్రీం’ ఆదేశం.
  •  పోలీసులు, డీజీపీ తీరుపై జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం తీవ్ర అసహనం.
  •  నేడు తొలి కేసుగా విచారణ.. సెప్టెంబర్ 30లోగా సీల్డ్ కవర్ నివేదిక.
    న్యూఢిల్లీ, మహా.

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానంలో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో జరుగుతున్న విచారణలపై స్టే విధించాలన్న అంశంతో పాటు, కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలనే ఆదేశాలపై నిర్ణయాన్ని ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. సాయికృష్ణ వ్యవహారంలో హైకోర్టులో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాలు, విచారణ ముగిసి తీర్పు రిజర్వ్‌లో ఉన్న కేసుల సమగ్ర వివరాలను గురువారం ఉదయం 10:30 గంటల కల్లా తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పిటిషనర్లకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో కేసు ఏ దశలో ఉందో పూర్తిస్థాయిలో తెలుసుకున్న తర్వాతే తదుపరి ఉత్తర్వులు వెలువరిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
లంచ్ బ్రేక్ అనంతరం జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు హైకోర్టులోని కేసుల తాజా స్థితిని జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం ముందుంచారు. సాయికృష్ణ అదృశ్యంపై ఆయన తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌తో పాటు, సమగ్ర దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన మధ్యంతర దరఖాస్తులపై (ఐఏ) హైకోర్టులో ఇప్పటికే వాదనలు పూర్తయి తీర్పు వాయిదా పడిందని న్యాయస్థానానికి వివరించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. హైకోర్టు ఏయే అంశాలపై తీర్పును రిజర్వ్ చేసిందో పూర్తి వివరాలను గురువారం ఉదయానికి అందించాలని ఆదేశించింది. గురువారం ఉదయం తొలి కేసుగా దీనిని విచారణకు స్వీకరిస్తామని పేర్కొంటూ, ఉదయం ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను కొనసాగించాలా లేదా అన్న అంశంపై రేపే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేసింది.
కాగా, బుధవారం ఉదయం విచారణ సందర్భంగా పోలీసుల వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి ఆచూకీ లేకుండా పోవడం, అదే సమయంలో కేసుతో ముడిపడి ఉన్న ఆధారాలు ధ్వంసం కావడంపై ఏపీ పోలీసులు, డీజీపీ తీరును జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. రక్షక భటుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ఈ కేసుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సెప్టెంబర్ 30వ తేదీ నాటికి సీల్డ్ కవర్‌లో తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం ఈ ప్రధాన కేసు తదుపరి విచారణను అక్టోబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.