Mahaa Daily Exclusive

  విజయవాడలో వందేభారత్‌కు తప్పిన ముప్పు.

Share

  •  సీ-4 కోచ్‌లో మంటలు.
  •  రైలు దిగి పరుగులు తీసిన ప్రయాణికులు.
  •  ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం.
  •  హాట్ యాక్సిల్‌గా నిర్ధారించిన రైల్వే శాఖ.
  •  ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రైలు ఏర్పాటు.

    విజయవాడ, మహా:

నర్సాపూర్ నుంచి చెన్నై వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఈ రైలులోని సీ-4 (C4) కోచ్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించడంతో ప్లాట్‌ఫారమ్‌పై ఒక్కసారిగా కలకలం రేగింది. బోగీ నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు భయంతో వెంటనే రైలు దిగి ప్లాట్‌ఫారమ్‌పైకి పరుగులు తీశారు. స్టేషన్‌లోని రైల్వే సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పి, పెను ఊరట లభించింది.
ఈ ఘటనపై రైల్వే శాఖ వెంటనే స్పందించి అధికారిక వివరణ విడుదల చేసింది. నర్సాపూర్ – చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్: 20678) సాయంత్రం సరిగ్గా 5:00 గంటలకు విజయవాడ స్టేషన్‌కు చేరుకుందని అధికారులు తెలిపారు. అదే సమయంలో రైలులోని సీ-4 కోచ్ వద్ద ‘హాట్ యాక్సిల్’ (చక్రాల భాగం అధిక వేడికి గురికావడం) ఏర్పడినట్లు స్టేషన్ సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద తీవ్రతను పసిగట్టిన వెంటనే సాంకేతిక, భద్రతా విభాగాల బృందాలను అప్రమత్తం చేసి మంటలను ఆర్పడంతో పాటు అవసరమైన నివారణ చర్యలు చేపట్టారు.
ఈ ఆకస్మిక ఘటనతో నిలిచిపోయిన రైలు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్టేషన్‌లో ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు వేచి ఉండే గదులు, మంచినీరు, ఉచిత ఆహార సదుపాయాలు కల్పించారు. ప్రయాణికుల సహాయార్థం ప్లాట్‌ఫారమ్‌పై ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చారు. చెన్నై వెళ్లాల్సిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే శాఖ వెంటనే ప్రత్యామ్నాయ రైలును సిద్ధం చేసి పంపించింది. రైల్వే ఉన్నతాధికారులు స్వయంగా స్టేషన్‌లో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రయాణికులకు సహాయక చర్యలు అందించారు. సమయస్ఫూర్తితో స్పందించిన సిబ్బంది వల్ల పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.