Mahaa Daily Exclusive

  ఎన్నికల సంఘంలో విభేదాల కలకలం. నిర్ణయాలన్నీ ఏకగ్రీవమేనని ఈసీ స్పష్టీకరణ.

Share

న్యూఢిల్లీ, మహా .

దేశవ్యాప్తంగా చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘంలో (ఈసీ) తీవ్ర అంతర్గత విభేదాలు పొడసూపాయంటూ వెలువడిన ఓ పరిశోధనాత్మక కథనం దేశ రాజకీయాల్లో పెను దుమారానికి దారితీసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిషన్‌లో మిగిలిన ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పలు కీలక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు మీడియా వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే ఖండించింది. అంతర్గత చర్చల సమయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సహజమేనని, ముసాయిదా దశలో లేవనెత్తే ప్రశ్నలను తుది నిర్ణయాలుగా చూడలేమని స్పష్టం చేసింది. ఎస్‌ఐఆర్‌తో సహా కమిషన్ తీసుకున్న తుది నిర్ణయాలన్నీ ముగ్గురి ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగానే జరిగాయని కుండబద్దలు కొట్టింది.
పత్రికా కథనం ప్రకారం.. గత పది నెలల కాలంలో కనీసం 14 సందర్భాల్లో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలను నమోదు చేశారు. ఓటర్ల పేర్ల తొలగింపు, కొత్త నమోదు, తొలగించిన పేర్ల పునరుద్ధరణ, అప్పీళ్లు, ఓటర్ల సమాచార భద్రత తదితర అంశాలపై వారు తీవ్రస్థాయిలో ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా, తొలగించిన ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చిన నిర్ణయాలపై కమిషన్ తరఫున అప్పీళ్లు దాఖలు చేసేందుకు ఎవరు అనుమతించారన్న దానిపై సుఖ్‌బీర్ సింగ్ సంధు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొన్ని నిర్ణయాలు తమ దృష్టికి రాకుండానే జరిగాయని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఓటర్ల సమాచార వ్యవస్థను కేంద్ర స్థాయిలో కేంద్రీకరించే విధానంపైనా కమిషనర్లు అసమ్మతి వ్యక్తం చేస్తూ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి సైతం లేఖ రాసినట్లు ఆ కథనం పేర్కొంది.
ఈ సంచలన కథనంపై ఎన్నికల సంఘం అధికారిక వివరణ ఇచ్చింది. విధాన రూపకల్పన దశలో కమిషన్ సభ్యులు సందేహాలు వ్యక్తం చేయడం, సూచనలు ఇవ్వడం సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమేనని పేర్కొంది. ఓటర్ల హక్కులను పరిరక్షించే ఉద్దేశ్యంతోనే వ్యవస్థలో ఇటువంటి అంతర్గత పరిశీలనలు, సమతుల్యతలు ఉంటాయని వివరించింది. ముసాయిదా దశలో జరిగే చర్చలను తుది నిర్ణయాలతో ముడిపెట్టి చూడకూడదని, చివరకు అధికారిక ఆదేశాలన్నీ ముగ్గురు కమిషనర్ల ఆమోదంతోనే చట్టబద్ధంగా వెలువడ్డాయని ఈసీ స్పష్టం చేసింది.
మరోవైపు, ఎన్నికల సంఘంలో విభేదాల వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఇది భారత రాజ్యాంగంపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి అని, ‘ఓటు చోరీ’కి నిదర్శనమని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు ఆప్, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ వర్గం) తదితర పార్టీలు సైతం ఈసీ తీరును ఎండగట్టాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేసి పార్లమెంటరీ పర్యవేక్షణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. 2025లో బిహార్‌లో ప్రారంభమైన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ.. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో సుమారు 27.16 లక్షల మంది ఓటర్ల తొలగింపునకు, ఏకంగా 38.31 లక్షల అప్పీళ్లకు దారితీసి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన నేపథ్యంలో, తాజా కథనం దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతపై సరికొత్త న్యాయ, రాజకీయ చర్చకు తెరతీసింది.