Mahaa Daily Exclusive

  జన్వాడ ఫాంహౌస్‌ పై హైడ్రాకు కాంగ్రెస్ ఫిర్యాదు..

Share

  • జన్వాడ ఫాంహౌస్‌ పై హైడ్రాకు కాంగ్రెస్ ఫిర్యాదు
  • అంతకు ముందు ఫాంహౌస్ ను పరిశీలించిన కాంగ్రెస్‌ నేతలు
  • నాలాపై నిర్మించారన్న ప్రజా ప్రతినిధులు
  • కాంగ్రెస్ నేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్
  • బీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు

హైదరాబాద్, మహా : రంగారెడ్డి జిల్లా జన్వాడలోని ఫామ్‌హౌస్‌ మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల బృందం శనివారం జన్వాడ ఫామ్‌హౌస్‌ భూముల పరిశీలనకు వెళ్లింది. ఫామ్‌హౌస్‌ నిర్మాణం, భూముల యాజమాన్యం, నాలా ఆక్రమణలకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్‌ నేతలు.. సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులతో మాట్లాడి వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తామని వారు తెలిపారు. ప్రజాభవన్‌ నుంచి బస్సులో బయలుదేరిన కాంగ్రెస్‌ నేతల బృందం జన్వాడకు చేరుకుంది. ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌ యాదవ్‌‌లతోపాటు.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, సీనియర్‌ నేత కోదండరెడ్డి సహా పలువురు కీలక నేతలు ఈ పర్యటనలో పాల్గొన్నారు. నేతల పర్యటన నేపథ్యంలో జన్వాడ ఫామ్‌హౌస్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఫామ్‌హౌస్‌ను బుల్కాపూర్‌ నాలాపై నిర్మించారని, భవన నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని ఎంపీ మల్లు రవి ఆరోపించారు. ఫామ్‌హౌస్‌ ఎవరి పేరుపై ఉందనే విషయంలోనూ స్పష్టత లేదని ఆయన పేర్కొన్నారు. భూములకు సంబంధించిన లెక్కలు, నిర్మాణ అనుమతులను పరిశీలించి ప్రజలకు వాస్తవాలను తెలియజేయడానికే తాము ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. జన్వాడ ప్రాంతంలోని భూముల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సంబంధిత అధికారులను సంప్రదిస్తామని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. ముఖ్యంగా బుల్కాపూర్‌ నాలా విషయంలో ఆక్రమణలు జరిగాయన్న ఆరోపణలు కూడా ఈ సందర్భంగా తెరపైకి వచ్చాయి. జన్వాడ ఫామ్‌హౌస్‌ భూములపై ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. ఇన్ని ఎకరాల్లో ఫామ్‌హౌస్‌ నిర్మాణం ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. సర్వే నంబర్లు 311, 301, 313కు సంబంధించిన భూములపై అక్రమాలు ఉన్నాయా లేదా పరిశీలించాలని కోరారు.

ఈ భూములకు గతంలో సత్యం రామలింగరాజుకు సంబంధించిన సంస్థలతో సంబంధం ఉందని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం భూముల బదిలీలపై కూడా ఆయన పలు ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన పత్రాలు, అధికారిక రికార్డులపై పూర్తి స్థాయి పరిశీలన అవసరమని ఆయన అన్నారు. జన్వాడ ఫామ్‌హౌస్‌ విషయంలో కేటీఆర్‌ పేరు ప్రస్తావిస్తూ కూడా చామల కిరణ్‌కుమార్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఫామ్‌హౌస్‌ యాజమాన్యం, భూముల బదిలీలపై పూర్తి వివరాలను వెలికితీస్తామని చెప్పారు. కేటీఆర్‌కు సన్నిహితుడిగా పేర్కొంటున్న ప్రదీప్‌రెడ్డికి ఈ భూములు ఎలా వచ్చాయనే అంశంపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.

జన్వాడ ఫామ్‌హౌస్‌ భూముల పరిశీలన సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను ఫోన్‌లో సంప్రదించారు. బుల్కాపూర్‌ నాలా ఆక్రమణకు గురైందన్న ఆరోపణలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నాలా ఆక్రమణలపై పరిశీలన చేసి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉన్నట్లయితే చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్‌ అధికారులతోనూ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. జన్వాడలోని ఫామ్‌హౌస్‌ భవన నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా అనే అంశంపై ఆయన ప్రశ్నించారు. గతంలో నిర్మాణ అనుమతుల గురించి అడిగినప్పుడు సర్పంచ్‌ అనుమతితో నిర్మించుకున్నట్లు యజమాని చెప్పినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ వెల్లడించినట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.

కాంగ్రెస్‌ నేతల బృందం జన్వాడ ఫామ్‌హౌస్‌ వద్దకు చేరుకున్న సమయంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ నేతలను అడ్డుకునేందుకు అక్కడికి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జన్వాడ ఫామ్‌హౌస్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జన్వాడ భూములు, ఫామ్‌హౌస్‌ నిర్మాణం, నాలా ఆక్రమణలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అధికారికంగా భూముల రికార్డులు, నిర్మాణ అనుమతులు, నాలా హద్దులకు సంబంధించిన వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. కాంగ్రెస్‌ నేతలు చేసిన ఆరోపణలపై సంబంధిత వ్యక్తులు, బీఆర్‌ఎస్‌ నేతల అధికారిక స్పందన కూడా ఈ వ్యవహారంలో కీలకం కానుంది.