- సుప్రీంకోర్టుకు వెళ్లను
- ఉప ఎన్నికను ఎదుర్కునేందుకు సిద్ధం
- ‘నువ్వు ఫైటర్‌వి.. ఫైట్ చేద్దాం’ అని సీఎం చెప్పారు
- ఎమ్మెల్యే దానం నాగేందర్
హైదరాబాద్, మహా : తనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్ తాజాగా స్పందించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాను సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? అనేది స్పీకర్ నిర్ణయించాలని వ్యాఖ్యానించారు. శనివారం ఉదయం ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడిన ఆయన.. తీర్పు కాపీని పూర్తిగా చదివానని తెలిపారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక జరిగితే తాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఎన్నికలు తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోరాడేందుకు తాను ఇష్టపడతానని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తన కార్యకర్తలకు కూడా చెబుతున్నానన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసినట్లు వెల్లడించిన దానం.. ‘నువ్వు ఫైటర్‌వి.. ఫైట్ చేద్దాం’ అని సీఎం చెప్పినట్లు తెలిపారు. తాను ఇదే చేస్తానని చెప్పారు.
కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2024లో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ తరఫున 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ పరిణామాన్ని ఆధారంగా చేసుకుని ఆయనపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి 2024 మార్చి 18న అసెంబ్లీ స్పీకర్‌కు పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా 2024 జూలై 1న స్పీకర్‌ను ఆశ్రయించారు. పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందంటూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు 2025 జూలై 31న స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ విచారణ చేపట్టారు. దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుకు పాల్పడలేదని అందుకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ అనర్హత పిటిషన్‌ను తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పాడి కౌశిక్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు పూర్తయ్యాక హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.. సెప్టెంబర్ 18న తుది తీర్పు వెలువరించింది. స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేసిన హైకోర్టు.. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడని ప్రకటించింది. 2024 ఏప్రిల్ 23 నుంచి అనర్హత అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించి, తీర్పు ప్రతిని అసెంబ్లీ స్పీకర్, ఎన్నికల సంఘానికి పంపాలని ఆదేశించింది. కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన తేదీ నుంచే ఆయనపై అనర్హత వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో తన అనర్హత విషయంపై తాజాగా దానం నాగేందర్ స్పందించారు.







