Mahaa Daily Exclusive

  సభాపతిని అవమానించిన వారిని వదిలేది లేదు….

Share

సభాపతిని అవమానించిన వారిని వదిలేది లేదు.
*’ క్రిమినల్ కేసులు పెట్టి శిక్షిస్తాం.
* స్పీకర్‌కు జరిగిన అవమానం సమాజానికి జరిగినట్టే.
* కుట్రపూరిత ఘటనలపై సమగ్ర విచారణ.
* దోషులను తెలంగాణ సమాజం ఉపేక్షించదు సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మహా.

శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న కుట్రపూరిత ఘటనలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దోషులను శిక్షిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను అవమానించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

శాసనసభలో బుధవారం జరిగిన సుదీర్ఘ చర్చకు సభా నాయకుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. సమావేశాల తొలిరోజు స్పీకర్‌ను ఉద్దేశించి దుర్భాషలాడిన ఘటనతో పాటు దళితులు నడిచిన నేలను శుద్ధి చేసినట్లు జరిగిన సంఘటనలపై యావత్ శాసనసభ ఆందోళన వ్యక్తం చేసిందని తెలిపారు. ఈ ఘటనలతో మనస్తాపానికి గురైన స్పీకర్‌కు శాసనసభ అండగా నిలిచిందని పేర్కొన్నారు.

సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మనసును గాయపరిచిన వారిని వదిలిపెట్టబోమని సీఎం స్పష్టం చేశారు. అధికారులపై దాడులు చేయడంతో పాటు శాసనసభాపతి స్థానాన్ని అవమానించేలా కొందరు వ్యవహరించారని, సభాపతి తల్లిని సైతం అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు.

‘పథకం ప్రకారమే దాడి’

ఉన్మాదానికి లోనై, ఉసిగొల్పబడిన కొంతమంది ముష్కరులు అధికారులపై దాడులకు పాల్పడటమే కాకుండా సభాపతి స్థానాన్ని అవమానించేలా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక పథకం ప్రకారం దుర్మార్గమైన ఆలోచనతో ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు.

దేశంపై దాడికి ప్రయత్నించే ఉగ్రవాదులు, తీవ్రవాదులు వ్యవహరించే తీరుకు.. శాసనసభ ప్రాంగణంలో సభాపతిని అవమానిస్తూ మాట్లాడిన తీరుకు ఏమాత్రం తేడా లేదని సీఎం వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత వ్యవస్థ అయిన శాసనసభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.

‘తల్లిని అవమానించడం దారుణం’

తెలంగాణ సమాజంలో మహిళలకు ఉన్న గౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. భారతీయ సమాజం స్త్రీని అపరకాళి, భద్రకాళి, భూమాత, భారతమాత, తెలంగాణ తల్లి వంటి రూపాల్లో గౌరవిస్తుందని అన్నారు. శక్తి, గొప్పతనాన్ని ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు తల్లితో, మహిళతో పోల్చుకునే సంప్రదాయం మన సమాజంలో ఉందని వివరించారు.

అలాంటి తెలంగాణ గడ్డపై ఒక తల్లిని అవమానించే విధంగా వ్యవహరించడం దారుణమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సభాపతికి జరిగిన అవమానం కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదని, సమాజానికి జరిగిన అవమానంగా భావిస్తున్నామని అన్నారు.

దోషులను తెలంగాణ సమాజం ఉపేక్షించదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అన్యాయాన్ని ఎదిరించి పోరాడిన చరిత్ర తెలంగాణ గడ్డకు ఉందని, రజాకార్లను ఎదుర్కొని తరిమికొట్టిన పోరాట స్ఫూర్తి ఈ నేల సొంతమని గుర్తుచేశారు.

‘నిరసనకు అనేక మార్గాలున్నాయి’

ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయని సీఎం అన్నారు. ప్రభుత్వ విధానాలను, ప్రజా సమస్యలను వ్యతిరేకించేందుకు సభలోనూ, సభ వెలుపల ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే సభాపతి మనసును గాయపరిచేలా వ్యవహరించడం మాత్రం సమర్థనీయం కాదన్నారు.

సభాపతిని అవమానించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను చట్టం ముందు నిలబెడతామని తెలిపారు.

ప్రజా సమస్యలపై చర్చించాలనుకున్నాం

సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించాలని ప్రభుత్వం భావించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యారంగ సమస్యలు, ధరణిలో జరిగిన అక్రమాలు, 22A భూముల అంశం సహా ప్రతిపక్షాలు లేవనెత్తిన అనేక సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరగాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా కొందరు అడ్డుకున్నారని సీఎం ఆరోపించారు. శాసనసభ సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.

సభాపతి గౌరవం, రాజ్యాంగ వ్యవస్థల ప్రతిష్ఠను కాపాడటంతో పాటు ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చ జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో జరిగిన ఘటనలకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని తేల్చిచెప్పారు.

Latest