Mahaa Daily Exclusive

  చెక్కుచెదరని కాషాయ విశ్వరూపం..! దేశమంతా మళ్లీ మోడీ సునామీ..!

Share

  •  దేశమంతా మళ్లీ మోడీ సునామీ!
  •  విపక్షాల ఆశలపై చన్నీళ్లు.
  • ముక్కలైన ‘ఇండియా’ కూటమి భ్రమలు.
  •  326 సీట్లతో ఎన్డీఏ విహారం.
  •  ఇండియా టుడే – సీఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సంచలనం.

హైదరాబాద్, మహా.

దేశ రాజకీయ ముఖచిత్రంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తిరుగులేని మహానాయకుడిగా తన ఆధిపత్యాన్ని మరోసారి సుస్పష్టం చేశారు. వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టి చరిత్ర సృష్టించినా, ప్రజాక్షేత్రంలో ఆయన పట్ల ప్రజలకున్న తిరుగులేని విశ్వాసం, అపారమైన ఆదరణ ఏమాత్రం తగ్గలేదని దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఇండియా టుడే – సీఓటర్‘మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఘనంగా చాటిచెప్పింది. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఎంతగా గళమెత్తినా, పాలకపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నినా, ఈ క్షణంలో లోక్‌సభ ఎన్నికలు జరిగినా ప్రజలు మళ్లీ ముక్తకంఠంతో నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికే సంపూర్ణ పట్టాభిషేకం చేస్తారని ఈ సర్వే నిర్ద్వంద్వంగా తేల్చేసింది. ఎన్డీఏ కూటమి ఏకంగా 326 స్థానాల్లో ప్రచండ విజయం సాధించి, సంపూర్ణ మెజారిటీతో తిరుగులేని రీతిలో కేంద్రంలో అధికారాన్ని సునాయాసంగా నిలబెట్టుకుంటుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గత కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నీట్ పరీక్షల వివాదం, విద్యార్థి లోకంలో రేకెత్తిన ఆందోళనలు, రామ మందిర విరాళాలపై విపక్షాలు సృష్టించిన రాద్ధాంతం, ఈ20 పెట్రోల్ ఇంధన అంశాలు కాషాయ దళానికి గట్టి దెబ్బ కొడతాయని రాజకీయ పరిశీలకులు భావించారు. ముఖ్యంగా నవతరం ‘జనరేషన్-జెడ్’ ఓటర్ల ప్రభావం బీజేపీ ఓటు బ్యాంకును గండికొడుతుందని, కేంద్ర ప్రభుత్వంపై యువత తీవ్ర వ్యతిరేకతతో రగిలిపోతోందని భావించిన ప్రతిపక్షాల లెక్కలన్నీ ఈ సర్వే ముందు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. సవాళ్లు ఎదురైనా, జెన్-జీ ఓటర్ల రూపంలో అసంతృప్తి సెగలు కనిపించినా.. దేశ సమగ్రత, పటిష్టమైన భద్రత, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ స్థాయిలో భారత్ సాధిస్తున్న అద్భుత విజయాలను దృష్టిలో ఉంచుకుని దేశ ప్రజలు మోడీ దూరదృష్టి గల నాయకత్వానికే సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రతికూల పరిస్థితులను కూడా రాజకీయ విజయాలుగా మలచుకోగల చాణక్య వ్యూహాలు మోడీ-షా ద్వయానికే సొంతమని మరోసారి రుజువైంది.
మరోవైపు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో 234 సీట్లతో ఊపిరి పీల్చుకుని, త్వరలోనే ఢిల్లీ పీఠాన్ని కూలుస్తామంటూ శపథం చేసిన కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమికి ఈ సర్వే ఫలితాలు కోలుకోలేని ఊహించని షాక్ ఇచ్చాయి. దేశ ప్రజలు విపక్షాల వైఖరిని, ప్రత్యామ్నాయ ఎజెండా లేని వారి మైత్రిని ఎంతమాత్రం ఆదరించడం లేదని ఈ లెక్కలు బహిర్గతం చేశాయి. నేడు ఎన్నికలు జరిగితే ఇండియా కూటమి బలం కేవలం 185 సీట్లకే దారుణంగా పడిపోతుందని తేలిపోయింది. ఇది గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ప్రతిపక్ష కూటమికి ఎదురైన అత్యంత ఘోరమైన పరాభవంగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. జనవరి సర్వేతో పోలిస్తే ఇండియా కూటమి సీట్లలో కేవలం మూడు సీట్ల స్వల్ప మార్పు తప్ప, మోడీ ప్రభంజనాన్ని అడ్డుకునే శక్తిసామర్థ్యాలు విపక్షాల కూటమిలో ఏమాత్రం కనిపించడం లేదని ఈ సర్వే తేటతెల్లం చేసింది.
జూలై 1 నుంచి ఆగస్టు 25 మధ్య సుదీర్ఘంగా సాగిన ఈ సమగ్ర సర్వే ప్రక్రియలో దేశవ్యాప్తంగా 25,184 మంది పౌరుల నుంచి అత్యంత శాస్త్రీయంగా ముఖాముఖి అభిప్రాయాలను సేకరించారు. దీనికి తోడు గత ఆరు నెలల కాలంలో సీఓటర్ ట్రాకర్ ద్వారా సేకరించిన మరో 91,795 మంది విస్తృత ఇంటర్వ్యూలను కూడా క్షుణ్ణంగా విశ్లేషించి దాదాపు లక్షా పదిహేను వేల మందికి పైగా ఓటర్ల నాడిని పట్టుకుని ఈ సమగ్ర నివేదికను రూపొందించారు. ఈ విస్తృత అధ్యయనంలో ప్రధానమంత్రి పీఠానికి దేశవ్యాప్తంగా అత్యంత అర్హుడు, అత్యుత్తమ నాయకుడు నరేంద్ర మోడీయేనని దేశ ప్రజానీకం ముక్తకంఠంతో తేల్చిచెప్పింది. భారత రాజకీయ క్షేత్రంలో మోడీకి దరిదాపుల్లో నిలబడగల ప్రత్యామ్నాయ జాతీయ నాయకుడే లేరని, ఆయన పాలనపై దేశ ప్రజల విశ్వాసం హిమాలయమంత దృఢంగా ఉందని ఈ తాజా నివేదిక అత్యంత బలంగా చాటిచెప్పింది.